చెన్నై: సీనియర్ నటుడు శరత్‌బాబు (Sarath Babu) భౌతికకాయానికి సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నివాళులర్పించారు. చెన్నైలోని (Chennai) త్యాగరాయనగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన రజనీకాంత్.. శరత్‌బాబు భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ.. మంచిమిత్రుడిని కోల్పోయానని చెప్పారు. నటుడు కాకముందే ఆయనతో తనకు పరిచయం ఉందని తెలిపారు. శరత్‌బాబు తనకు అత్యంత సన్నిహితుడని, తనపట్ల ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు.
ఆయన కోపంగా ఉండటం తానెప్పుడూ చూడలేదన్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయని చెప్పారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. ముత్తూ, అన్నామలై సహా చాలా సినిమాలో తామిద్దరం కలిసి నటించామని తెలిపారు. సిగరెట్లు తాగొద్దని తనను వారించేవాడని, ఆరోగ్యంగా ఉండాలని చాలాసార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు.
He (Sarath Babu) was a good man. I never saw him angry. All of his films were a very big hit. He was very affectionate towards me. I feel sad on his demise: Rajinikanth pic.twitter.com/5q3Q0SuYkV
— ANI (@ANI) May 23, 2023
తెలుగు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన సీనియర్ నటుడు శరత్‌బాబు (71) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత నెల 20న తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం నుంచి శరత్‌బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాల వైఫల్యం కారణంగా మరణించారని ఏఐజీ వైద్యులు ప్రకటించారు. శరత్‌బాబు మరణంతో తెలుగు సినీరంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సంతాపం ప్రకటించింది. శరత్‌బాబు అంత్యక్రియలను చెన్నై నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.