Rajinikanth : ఇటీవల అనారోగ్యానికి గురైన తమిళ సూపర్‌స్టార్ (Super star) రజనీకాంత్ (Rajinikanth) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత తొలిసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
‘నా ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని రజినీకాంత్ పేర్కొన్నారు. తాను త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
రజనీకాంత్ సెప్టెంబర్ 30న చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు.
ఇదిలావుంటే రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ అక్టోబర్ 10న విడుదల కానుంది. టీజే జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన ‘కూలీ’ కోసం వర్క్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విశ్రాంతి అనంతరం రజనీకాంత్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉంది.