Posani Krishnamurali | ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా.. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు ఆయనను బుధవారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అనంతరం ఓబులవారిపల్లె తరలించారు. హైదరాబాద్ రాయదుర్గం మై హోమ్ భూజ అపార్ట్మెంట్లోని ఆయన నివాసానికి వెళ్ళిన ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోసానిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో శ్రీ అన్నమయ్య జిల్లా రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే పోసానిపై మొత్తం 11 కేసులు ఉన్నట్లు సమాచారం. ఇందులో బీఎన్ఎస్ 196,353 (2),111 రెడ్ విత్ 3 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంతకుముందు బుధవారం రాత్రి పోసాని అరెస్ట్ చేసే క్రమంలో అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మీరెవరో నాకు తెలియదు. నేనేందుకు రావాలంటూ పోలీసులను ప్రశ్నించాడు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని.. నోటీసులు పంపితే ఆరోగ్యం కుదుటపడ్డాక పోలీసుల ముందు విచారణకు హాజరవుతానని పోసాని తెలిపాడు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై జనసేన నేత జోగినేని మణి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నేడు పోసానిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.