సినిమా పేరు : రాబిన్‌హుడ్
తారాగణం: నితిన్, శ్రీలీల, లాల్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, ప్రత్యేక పాత్రలో డేవిడ్ వార్నర్..
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్
నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్
మైత్రీ మూవీమేకర్స్ నుంచి సినిమా వస్తుంది అనగానే ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం జనాల్లో నిండిపోయింది. దాంతో ఆటోమేటిగ్గా ‘రాబిన్‌హుడ్’పై అంచనాలు మొదలయ్యాయి. పైగా దర్శకుడు వెంకీ కుడుము ప్రీవియస్ మూవీస్ ఛలో, భీష్మ సినిమా కమర్షియల్ సక్సెస్‌లు కావడంతో ఈ సినిమాతో డైరెక్టర్‌గా వెంకీ హ్యాట్రిక్ కొడతాడని అందరూ నమ్మారు. దానికి తగ్గట్టే ప్రచార చిత్రాలు కూడా బాగానే జనబాహుళ్యంలో ప్రచారం పొందాయి. నితిన్ స్క్రీన్ ప్రెజన్స్, శ్రీలీల గ్లామర్, అదిదా.. సర్ప్రైజూ అంటూ కేతికా శర్మ వైవిధ్యమైన మూమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘రాబిన్‌హుడ్’ థియేటర్లలోకి వచ్చేశాడు. మరి అందరూ అనుకున్నట్టు జనాలకు నచ్చాడా? లేదా? అనేది తెలుసుకునే ముందు ముందు కథలోకెళ్దాం.
కథ
అనాధ అయిన రామ్(నితిన్)ని ఓ పెద్దాయన(లాల్) ఓ అనాథ శరణాలయంలో వదిలిపెట్టి వెళ్తాడు. ఆ శరణాలయంలోనే పెరుగుతుంటాడు రామ్. అయితే.. ప్రభుత్వం నుంచి కానీ.. సంపన్నుల నుంచి కానీ ఆ అనాధాశ్రమానికి ఎలాంటి సహకారం రాదు. పేరు ప్రఖ్యాతులు పెంచుకునేందుకు, పబ్లిసిటీ కోసం ఆ శరణాలయాన్నీ.. అందులోని అనాధల్ని అందరూ ఉపయోగించుకునేవారే తప్ప, ఆ అనాథలకు పట్టెడు అన్నం పెట్టే నాథుడే ఉండడు. దాంతో ఆ శరణాలయాన్ని నడపడమే కష్టమై ఇబ్బందులు పడుతుంటాడు వార్డెన్(శుభలేఖ సుధాకర్). ఆ పరిస్థితులన్నీ గమనించిన రామ్.. సాటి అనాధలకు అండగా నిలవాలనుకుంటాడు. దేవుడు అందర్నీ ఒకేలా పుట్టించాడు.. కానీ ఉన్నవారూ, లేనివారు అనే తారతమ్యాలు మాత్రం మనిషే సృష్టించాడు. ఈ అంతరాలు చెరిగిపోవాలి. అందరూ సమానం కావాలి.. అనే ధృక్పధంతో ‘రాబిన్‌హుడ్’గా మారతాడు రామ్. ఎవరికీ తెలీకుండా ఉన్నవాళ్లను కొల్లగొట్టి లేనివాళ్లకు పెట్టడం మొదలుపెడతాడు. తన శరణాలయంతోపాటు కనిపించే ప్రతి పేదవాడికీ అండగా నిలుస్తాడు. అలాగే పెరిగిపెద్దవుతాడు. తన శరణాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. అయితే.. సిటీలో జరుగుతున్న దొంగతనాలకు కారణం రాబిన్‌హుడ్ అని పోలీసులకు తెలుస్తుంది. అయితే.. ఆ రాబిన్‌హుడ్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అతడ్ని పట్టుకోడానికి ఓ స్పెషల్ డ్యూటీగా వైల్డ్‌డాగ్ అని పిలవబడే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నియమిస్తుంది ప్రభుత్వం. మరి రాబిన్‌హుడ్‌ని ఆ ఆఫీసర్ పట్టుకున్నాడా? అసలు రామ్‌ని శరణాలయంలో వదిలిపెట్టిన ఆ పెద్దాయన ఎవరు? సమాజంలో అంతరాలు తొలగిపోవాలి.. అందరూ సమానంగా బ్రతకాలి అనే సిద్ధాంతం అతని మనసులో నాటుకుపోవడానికి కారణం ఎవరు? కథాక్రమంలో రాబిన్‌హుడ్ చేసిన సాహసాలేంటి? ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
మంచివాడూ, తెలివైనవాడూ, ధైర్యవంతుడు అయిన ఒక అనాథ కథ ఇది. తారతమ్యాలను తొలిగించాలి.. సమాజంలోని ఫలాలన్నీ అందరికీ సమంగా అందాలి అని కోరుకునే ఓ ఆదర్శవాది కథ. ఇందులో హీరో ఆలోచనలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే దాన్ని దర్శకుడు ఎంత కొత్తగా చూపించాడు.. అనే విషయంలోనే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటూ దర్శకుడు వెంకీ కుడుముల కొంతమేర సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమాను వినోదాత్మకంగా నడిపిస్తూనే, హీరోపాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. హీరో శక్తిమంతుడు అయినప్పుడు.. విలన్ అత్యంత శక్తిమంతుడు అయితేనే ఆడియన్స్‌కి ఆసక్తి రెట్టింపవుతుంది. ఈ సినిమాలో దర్శకుడు చేసిన జిమ్మిక్కు అదే. మరి అలాంటి విలన్ని హీరో ఎలా తుదముట్టించాడు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. ‘శ్రీలంకలో మొదలైన సమస్యను రాముడు ఎలా తీర్చాడు?’ ఈ ప్రశ్నకు సమాధానమే కథంతా. ఈ క్రమంలోనే హీరోయిన్ తదితర పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. మరో విశేషమేంటంటే.. కథలో లేని పాత్రలు ఈ సినిమాలో అరుదుగా కనిపిస్తాయి. ఇందులో హీరో ముందు సమాజం గురించి ఆలోచిస్తాడు.. తర్వాత తన గురించి ఆలోచించిన ఓ పెద్దాయన గురించి ఆలోచిస్తాడు. ఆ పెద్దాయన ఊరైన రుద్రకొండ ఓ దుర్మార్గుడి కబందహస్తాల్లో చిక్కుకొని అల్లాడిపోతూ ఉంది. అక్కడి గంజాయిని పండిస్తూ.. ఆ సాగుని చట్టబద్ధం చేసి, కోట్లు సంపాదించాలని ఆ రాక్షసుడు ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తను చేసిన ప్రయత్నాలను హీరో ఎలా తిప్పికొట్టాడు అనేది ఆసక్తికరంగా సాగుతుంది. ప్రథమార్ధం అంతా సరదాగా సాగిన ఈ సినిమా, ద్వితాయార్థంలో కాస్తంత సీరియస్ మోడ్‌లో కాస్తంత స్లోగా నడుస్తుంది. అయితే వినోదాన్ని మాత్రం ఎక్కడా ఢోకా ఉండదు.
ఎవరెవరు ఎలా చేశారు?
నితిన్‌కి ఇలాంటి పర్ఫార్మెన్స్ అతనికి కొత్తేం కాదు. ఎప్పటిలాగే బాగా చేశాడు. డైలాగ్ టైమింగ్‌లో, యాక్షన్ సీన్స్‌లో అలరించాడు. ఇక శ్రీలీల పాత్ర కూడా ఫన్నీగా బావుంది. తన గురించి తాను కాస్తంత ఎక్కువగా ఫీలయ్యే ఓ అమాయకమైన అమ్మాయి పాత్ర తనది. బాగా చేసింది.. తెరపై అందంగా కూడా కనిపించింది. ఎప్పటిలాగే స్టెప్పులు ఇరగదీసింది. రాజేంద్రప్రసాద్, వెన్నెలకిశోర్ నవ్వులు పూయించారు.
డేవిడ్ వార్నర్ చివర్లో మెరుపులు మెరిపించాడు. విలన్‌గా నటించిన కొత్త నటుడు కూడా బాగానే ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులందరూ పరిథిమేర రక్తి కట్టించారు.
సాంకేతికంగా..
దర్శకుడు రాసుకున్న కథలో కొత్తదనం అయితే లేదు. అయితే.. నడిపించిన తీరు బావుంది. డైలాగులు బాగా రాసుకున్నారు. యాక్షన్ సీన్స్ కూడా బావున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం పర్లదు అనిపించింది. చూడ్డానికీ వినడానికీ రెండు పాటలు బావున్నాయి. కెమెరా వర్క్ అంత గొప్పగా అయితే ఏం లేదు. ఎడిటర్‌కి ఇంకాస్త పనుందేమో అనిపిపిస్తుంది. నిర్మాతలైతే ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. మొత్తంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చేమోకానీ.. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ‘రాబిన్‌హుడ్’ తప్పకుండా నచ్చుతాడు.
బలాలు: కథనం, యాక్షన్ ఎపిసోడ్స్, నటీనటులకు నటన, ప్రథమార్ధం.
బలహీనతలు: కథలో కొత్తదనం లేకపోవడం, కెమెరా పనితనం..
రేటింగ్ 2.75/5