Naresh | దేశంలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఇండిగో విమానయాన సంస్థ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్‌కు ఇండిగో షాక్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణికులను విపరీతంగా కుక్కేయడంపై నరేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న నరేష్‌కు ఎయిర్‌పోర్టు నుంచి విమానం వరకు తీసుకెళ్లే బస్సులో మొదట సీటు లభించింది. అయితే ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణికులు రావడంతో, సామర్థ్యాన్ని మించి అందరినీ అదే బస్సులో ఎక్కించారని తెలిపారు. దీంతో బస్సులో తీవ్ర అసౌకర్యం ఏర్పడిందని నరేష్ పేర్కొన్నారు.
ఈ విషయంపై అక్కడే ఉన్న ఇండిగో సిబ్బందితో నరేష్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో, పరిస్థితిని ఫోటోల రూపంలో చిత్రీకరించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్లో ఇండిగో బస్సులను “టార్చర్ ఛాంబర్స్”గా అభివర్ణిస్తూ, ఎయిర్‌లైన్ గుత్తాధిపత్యానికి ఇవి నిదర్శనమని మండిపడ్డారు. బస్సులో ప్రయాణికులను సామర్థ్యానికి రెండింతల సంఖ్యలో, పశువుల్లా ఎక్కించారని నరేష్ ఆరోపించారు. అందులో సీనియర్ సిటిజన్లు, వీల్‌చైర్‌లో ఉన్నవారు కూడా నిలబడటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఇకపై ఈ విధమైన ఓవర్‌లోడింగ్‌ను వెంటనే ఆపాలని తాను గట్టిగా ప్రశ్నించానని అన్నారు.
బస్సులకు నిర్దిష్ట పరిమితి ఉండాలని, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై చట్టబద్ధంగా ముందుకెళ్లేందుకు తన న్యాయ బృందంతో చర్చిస్తున్నట్లు కూడా నరేష్ ట్వీట్లో పేర్కొన్నారు.నరేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎయిర్‌లైన్స్ మరింత బాధ్యతగా వ్యవహరించాలన్న డిమాండ్ నెటిజన్ల నుంచి కూడా వెల్లువెత్తుతోంది. మరి దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.