Pratap Pothen Died | ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశాడు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చెన్నైలోని తన నివాసంలో పోతెన్ తుది శ్వాస విడిచాడు. ఈయన మరణం పట్ల దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈయన మలయళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించాడు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా పలు విభాగాల్లో పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
పోతెన్ మొదట ముంభైలోని ప్రముఖ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ పనిచేశాడు. ఈ తరువాత ‘ఆరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండవ సినిమా ‘తకరా’తో బెస్ట్ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ అందుకున్నాడు. ‘ఆరోహణం’, ‘పన్నీర్ పుష్పంగళ్’, ‘తన్మాత్ర’, ’22 ఫీమేల్ కొట్టయమ్’, ‘బెంగళూర్ డేస్’ వంటి సినిమాలతో మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ‘ఆకలిరాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి సినిమాల్లో నటించాడు. తమిళంలో ‘జీవా’, ‘వెట్రీ విజా’, ‘సీవలపెరి పండీ’, ‘లక్కీ’ మ్యాన్ వంటి సినిమాల్లో నటించాడు.
చివరగా ఈయన ‘సీ.బి15 :ది బ్రెయిన్’ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఈయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి షూటింగ్ దశలో ఉంది.ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ని 1985లో పెళ్ళి చేసుకున్నాడు. ఏడాదిలోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు అమల సత్యనాథ్‌ను పెళ్ళి చేసుకున్నాడు. 22 సంవత్సరాల తర్వాత 2012లో వీరిద్దరు విడిపోయారు. దర్శకుడిగా పోతెన్ మొదటి చిత్రం ‘మీండుమ్ ఒరు కాతల్ కథై’ సినిమాను రాధికాయే నిర్మించింది. ఇక రెండవ సినిమాకే దర్శకుడిగా పోతెన్ ఫిలిం ఫేర్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈయన 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు.