ముంబై: బాలీవుడ్ నటులు, దంపతులు అయిన ఫర్దీన్ ఖాన్ (Fardeen Khan), నటషా మెద్వానీ (Natasha Madhvani) మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఒకరంటే ఒకరికి పొసగక ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరు ఉంటున్నారని గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఆ జంట తెరదించింది. శనివారం ముంబైలోని శాంటాక్రజ్ ఏరియాలోగల ఓ షాపింగ్ మాల్లో తమ పిల్లలు దియానీ ఇసాబెల్లా ఖాన్ (Diani Isabella Khan), అజారియస్ ఫర్దీన్ ఖాన్ (Azarius Fardeen Khan) లతో కలిసి ఆ ఇద్దరూ షాపింగ్ చేశారు.
వాళ్లు షాపింగ్ చేసి బయటకు వస్తున్న దృశ్యాలను అక్కడున్న కొంత మంది తమ మొబైల్స్‌లో వీడియోలు తీశారు. వాటిలో ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, ఫర్దీన్ ఖాన్, నటషా మెద్వానీల అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వాళ్లు తమ మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను సరిదిద్దుకున్నట్టున్నారు, సంతోషం’ అని ఓ నెటిజన్ పేర్కొనగా.. వాళ్లు విడిపోతున్నట్టు జరిగింది ఒట్టి ప్రచారమేనా..?’ అని మరో నెటిజన్ స్పందించాడు.
కాగా, నటులు ఫర్దీన్ ఖాన్, నటషా మెద్వానీలు 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2013లో కూతురు దియా ఇసాబెల్లా ఖాన్ జన్మించగా, 2017లో కుమారుడు అజారియస్ ఫర్దీన్ ఖాన్ పుట్టాడు. అయితే, ఏడాది క్రితం ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఫర్దీన్ ఖాన్ తన తల్లితో కలిసి ముంబైలో ఉంటున్నాడని, నటషా మెద్వానీ తన పిల్లలతో కలిసి లండన్‌లో ఉంటున్నదని, త్వరలో ఆ జంట విడాకులు తీసుకోబోతున్నదని పుకార్లు షికార్లు చేశాయి. ఇంతలో ఆ ఇద్దరూ పిల్లలతో కలిసి షాపింగ్‌కు వచ్చి పుకార్లకు తెరదించారు.