Jismat JailMandi | మందీ (Mandi) వంటకాలకు హైదరాబాద్‌లో ఒక ట్రెండ్‌ను సెట్ చేసిన ‘జిస్మత్’ (Gismat) ఇప్పుడు కొత్త పేరు, కొత్త కాన్సెప్ట్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది. మందీ ప్రియుల కోసం వైవిధ్యమైన రుచులను అందించే లక్ష్యంతో, నటుడు, ‘జిస్మత్’ అధినేత ధర్మ మహేష్ అమీర్‌పేట్‌లో ‘జిస్మత్ జైల్ మందీ’ పేరుతో కొత్త రెస్టారెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్ దగ్గర ప్రారంభమైన ఈ కొత్త అవుట్లెట్ విశేషం ఏమిటంటే, ధర్మ మహేష్ దీనిని తన ప్రియమైన తనయుడు జగద్వాజ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం.
ఈ సందర్భంగా ధర్మ మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. మందీ అనగానే భోజన ప్రియులకు ‘జిస్మత్’ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. అందుకే మెనూలో నిరంతరం కొత్తదనాన్ని అందిస్తూ, చికెన్, మటన్, చేపలు, పన్నీర్ వంటి శాఖాహారం, మాంసాహారం రెండింటిలోనూ అత్యుత్తమ, నాణ్యమైన రుచులను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. “Gismat” నుంచి “Jismat”కు బ్రాండ్‌ను మార్చడం వెనుక నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను ఇది సూచిస్తుంది.
ఉత్తమ డెబ్యూ గామా అవార్డు గ్రహీత, సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాల నటుడైన ధర్మ మహేష్ మాట్లాడుతూ, ‘జిస్మత్’ అనే బ్రాండ్ తన కొడుకు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టిందని భావోద్వేగంతో తెలిపారు. ఈ పరివర్తన కేవలం పేరు మార్పు మాత్రమే కాదని, దీనికి మరింత లోతైన భావోద్వేగ బంధం ఉందని ఆయన వివరించారు.
ధర్మ మహేష్ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఆయన తమ కంపెనీ యాజమాన్యాన్ని పూర్తిగా తన కుమారుడు జగద్వజకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే, ఈ బిజినెస్ మొత్తం ఇకపై జగద్వజ పేరు మీదకు మారనుంది. ఈ యాజమాన్యం బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు, ధర్మ మహేష్ వ్యక్తిగతంగా రెస్టారెంట్ కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తారు.
“ఇక్కడ వడ్డించే ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథులు ఇచ్చే ప్రతి చిరునవ్వు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త ‘జిస్మత్’ గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. రాబోయే దశాబ్దాల పాటు ఈ పరిణామం బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని ధర్మ మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.