Sujatha Vijayakumar – Jayam Ravi | ప్రముఖ నటుడు జయం రవి కుటుంబంలో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆయన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా, ఆయన అత్త, సినీ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ తాజాగా సంచలన ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చారు. జయం రవి ప్రవర్తన వల్లే తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆయన తనకిచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సినీ నిర్మాణ రంగంలోకి రావడానికి జయం రవి ప్రోత్సాహమే కారణమని సుజాత విజయ్‌కుమార్ తెలిపారు. తన అల్లుడిని సొంత కొడుకులా భావించానని, ఆయన హీరోగా ‘అడంగ మరు’, ‘భూమి’, ‘సైరన్’ వంటి చిత్రాలను నిర్మించానని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాల నిర్మాణం కోసం ఫైనాన్షియర్ల నుంచి దాదాపు రూ. 100 కోట్లు అప్పు చేశానని, అందులో 25 శాతం జయం రవికే పారితోషికంగా చెల్లించానని ఆమె స్పష్టం చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా ఆమె వెల్లడించారు.
తన ప్రకటనలో సుజాత విజయ్‌కుమార్ మాట్లాడుతూ, “అప్పుల వల్ల నేను నిద్రలేని రాత్రులు గడిపాను. వాటిపై వచ్చే వడ్డీలన్నీ నేనొక్కదాన్నే కట్టేదాన్ని. ‘సైరన్’ సినిమా సమయంలో నష్టాలను భర్తీ చేయడానికి నా బ్యానర్లోనే మరో సినిమా చేస్తానని జయం రవి మాట ఇచ్చాడు. కానీ, ఇప్పటివరకు ఏ సినిమాకు సంతకం చేయలేదు. అంతేకాదు, అప్పులు తీర్చడానికి కూడా ఎలాంటి సహాయం చేయలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
జయం రవి తనను ప్రేమగా ‘అమ్మా’ అని పిలిచేవాడని, కానీ ఇప్పుడు సానుభూతి కోసం ఆయన చేస్తున్న ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె అన్నారు. ఆయనలోని హీరో అనే భావన తనలో పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఆయన ఎప్పటికీ తన దృష్టిలో హీరోగానే ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ తాజా ఆరోపణలు జయం రవి వ్యక్తిగత జీవితంలో మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై జయం రవి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.