Jayam Ravi | కోలీవుడ్ నటుడు జయం రవి (రవి మోహన్) విడాకుల కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. తన భార్య ఆర్తి రవి, జయం రవి నుంచి నెలకు ఏకంగా రూ. 40 లక్షల భరణం కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
చెన్నైలోని మూడవ అదనపు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో వీరిద్దరి విడాకుల కేసు నేడు విచారణకు రాగా.. జయం రవి తన విడాకుల దరఖాస్తులో రాజీ పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీనికి కౌంటర్‌గా.. ఆర్తి రవి తాను విడిపోయిన తర్వాత ఆర్థిక సహాయం అవసరమని పేర్కొంటూ, నెలకు రూ. 40 లక్షల భరణం కోరుతూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేసును జూన్ 12కు వాయిదా వేశారు. ఈ భారీ భరణం డిమాండ్ సినీ వర్గాల్లో, మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
రవి మోహన్, ఆర్తి రవి మధ్య గత కొన్ని నెలలుగా విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. జయం రవి, గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై జయం రవి మాట్లాడుతూ.. కెనీషా తనకు కష్ట సమయాల్లో అండగా నిలిచిందని పేర్కొన్నారు. దీనికి ఆర్తి రవి తీవ్రంగా స్పందిస్తూ, తమ బంధం విడిపోవడానికి “మూడో వ్యక్తి” కారణమని ఆరోపించారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. “మీ జీవితపు వెలుగు, మా జీవితాల్లో చీకటిని తెచ్చింది. అదే నిజం” అంటూ ఆర్తి పరోక్షంగా కెనీషాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దాదాపు 15 సంవత్సరాలుగా వైవాహిక జీవితం గడిపిన జయం రవి, ఆర్తి రవిల వివాదం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది.