నిరంతరాయంగా అన్నార్తుల ఆకలి తీర్చిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ కథతో రూపొందిన బయోపిక్ ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. టైటిల్‌రోల్ ఆమని పోషించారు. టి.వి.రవి నారాయణ్ దర్శకుడు. వల్లూరి రాంబాబు నిర్మాత. ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత అంబికాకృష్ణ, దర్శకుడు రేలంగి నరసింహారావు అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘డొక్కా సీతమ్మ చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలియాలి. డబ్బు కోసం చేస్తున్న సినిమా కాదిది. ఓ మహనీయురాలి చరిత్రను తెలుగువారందరికీ తెలియజేయాలని సంకల్పంతో చేస్తున్న సినిమా. ఆమని అద్భుతంగా నటించారు. త్వరలోనే ట్రైలర్ విడుదలచేస్తాం.’ అని దర్శకుడు తెలిపారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే రాసిపెట్టి ఉండాలని, మురళీమోహన్గారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమని చెప్పారు. ఆమనికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి అని మురళీమోహన్ ఆకాంక్షించారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.