Raanjhanaa Re-release | బాలీవుడ్ క్లాసిక్ చిత్రాలలో ఒకటైన రాంఝనా (Raanjhanaa) సినిమా క్లైమాక్స్‌ని AI ద్వారా మార్చుతున్నట్లు తెలిసి ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఇది సృజనాత్మక నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసినట్లే అని తెలిపాడు. తమిళ నటుడు ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాంఝనా (Raanjhanaa). సోనమ్ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా 2013లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను మళ్లీ తమిళంలో రీ రిలీజ్ చేయబోతున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషాదకరంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ధనుష్ పోషించిన పాత్ర చివరికి మరణిస్తుంది. దీంతో ఈ క్లైమాక్స్ తమిళ ప్రజలకు నచ్చలేదని అందుకే సినిమా క్లైమాక్స్‌ని (AI) ద్వారా మార్చి సంతోషకరమైన ముగింపుతో రీ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మార్పుపై దర్శకుడు రాయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. రాంఝనా క్లైమాక్స్ గురించి తనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, సోషల్ మీడియా ద్వారానే తెలిసిందని ఆనంద్ ఎల్ రాయ్ స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌ను మార్చడం అంటే ఆ చిత్ర ఆత్మను చంపేయడమే. అభిమానులు ఈ సినిమాను దాని లోపాలతో, అసంపూర్ణతలతోనే ప్రేమించారు. ఎలాంటి చర్చ లేకుండా ముగింపును మార్చడం సినిమా పట్ల, గత 12 సంవత్సరాలుగా ఈ సినిమాను గుండెల్లో పెట్టుకున్న అభిమానుల నమ్మకాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అని ఆయన పేర్కొన్నారు.
AIని ఉపయోగించి నటీనటుల నటనను వారి అనుమతి లేకుండా మార్చడం అనేక నైతిక, చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తులో ఇతర చిత్రాలకు కూడా ప్రమాదకరమైన ఉదాహరణగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పనులు వారి క్రియేటివిటీతో తక్కువ టైం లాభాల కోసం వాడేసుకుంటాయని ఆయన బాధపడ్డాడు.
ఈ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ మీడియా వరల్డ్ స్పందించింది. తాము సినిమాకు సంబంధించిన కాపీరైట్ మరియు నిర్మాణ హక్కులు తమ వద్దనే ఉన్నాయని పేర్కొంది. ఈ రీ-రిలీజ్ కొత్త ప్రేక్షకులకు క్లాసిక్ చిత్రాలను పరిచయం చేయడంలో భాగంగా చేసిన “సృజనాత్మక పునర్విమర్శ” అని సంస్థ తెలిపింది. ఇది అసలు చిత్రానికి ప్రత్యామ్నాయంగా, AI-మెరుగుపరచబడిన వెర్షన్‌గా మాత్రమే విడుదల అవుతుందని, అసలు చిత్రానికి ఎటువంటి నష్టం వాటిల్లదని వివరించింది. అయితే, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ మాత్రం AI ద్వారా మార్చబడిన ఈ వెర్షన్ నుండి తన పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.