Indian Film Festival of Melbourne | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 16వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFM)కు ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్ ఆగస్టు 14 నుంచి 24 2025 వరకు మెల్బోర్న్లో జరుగబోతుంది.
ఆమిర్ ఖాన్ భారతీయ సినిమాకు చేసిన అద్భుతమైన కృషిని ఈ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఆయన సినిమాల రెట్రోస్పెక్టివ్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ కూడా ఈ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుంది. ఈ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావడం పట్ల ఆమిర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేస్తూ, భారతీయ సినిమా వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని నిజంగా చాటిచెప్పే వేడుక ఇది అని పేర్కొన్నారు. ప్రేక్షకులతో మమేకమవడానికి, తన సినిమాలను పంచుకోవడానికి, సినిమా శక్తిని చాటిచెప్పే సంభాషణలలో పాల్గొనడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆయన తెలిపారు. ఆమిర్ ఖాన్ రాక పట్ల IFFM డైరెక్టర్ మిటు భౌమిక్ లాంగే సంతోషం వ్యక్తం చేశారు. ఆమిర్ ఖాన్ గొప్ప నటుడు మాత్రమే కాదు, ఆయన సినిమాలు ఎప్పుడూ సున్నితత్వం, లోతు, మరియు కథ చెప్పడంలో ఆయనకున్న అంకితభావాన్ని చూపిస్తాయని ఆమె అన్నారు. ఆయన రావడం వల్ల ఈ ఫెస్టివల్ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు మరింత ప్రత్యేకంగా మారుతుందని ఆమె తెలిపారు.