Sitaare Zameen Par | బాలీవుడ్ నటుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌లో ఈ సినిమా ప్రస్తుతం పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం రూ.100లకే ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవచ్చని చిత్రబృందం వెల్లడించింది.
సాధారణంగా సినిమాలు థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆమిర్ ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, నేరుగా అందరికి అందుబాటులో ఉన్న ఓటీటీ వేదిక యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేశాడు. అయితే ఈ వినూత్న విధానం ప్రేక్షకులకు ఎంతవరకు చేరువవుతుందో వేచి చూడాలి. ఎందుకంటే యూట్యూబ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవ్వడం వలన.. పెద్ద తేడా ఏమి ఉండదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు వచ్చిన పలు హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే యూట్యూబ్‌లో విడుదల చేశాయని సినీ వర్గాలు అంటున్నాయి.
ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లాల్ సింగ్ చద్దా వంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమిర్ ఈ సినిమా చేయడంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడంతో పాటు మంచి కలెక్షన్లు రాబట్టింది.