Maharaj | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం మహారాజ అనే పేరు మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి తమిళం నుంచి వచ్చిన మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి మహారాజా (Maharaja) కాగా.. రెండోది బాలీవుడ్ నుంచి వచ్చిన మహారాజ్(Maharaj). బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై భారీ సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాను సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా.. బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.
ఇది జునైద్ ఖాన్‌కు తొలి చిత్రం కాగా.. ఈ సినిమా విడుదలకు ముందే హిందుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ చిక్కుల్లో పడడంతో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. దీంతో విడుదల అవ్వడమే వివాదాలతో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా జునైద్ ఖాన్‌కు తొలి చిత్రం అయిన అలా లేదని అతడి నటన బాగుందని ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక కొడుకు మొదటి సినిమా ఇంతటి సక్సెస్ సాధించడం పట్ల బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మహారాజ్ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. ఇక ఈ పార్టీలో అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తాతో పాటు, జునైద్ ఖాన్, కూతురు ఐరా ఖాన్, చిత్ర దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్రా, షాలిని పాండే, జైదీప్ అహ్లావత్ తదితరులు పాల్గోన్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.
మహారాజ్ కథ విషయానికి వస్తే.. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన న్యాయ పోరాటాలలో ఒకటిగా పరిగణించబడే 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1862లో హిందూ ధర్మం పేరుతో ఒక ఆలయ బ్రాహ్మణ పూజారి యువతులను పెళ్లి కాకముందు నవ వధువులను చరణ్ సేవ పేరుతో అత్యాచారం చేస్తాడు. అయితే ఈ ప్రక్రియను తప్పు అని ఎవరు చెప్పకపోగా బలత్కారం అనంతరం చరణ్ సేవ అంటూ సంబరాలు చేసుకుంటారు. అయితే భక్తి ముసుగులో ఈ పూజారి చేస్తున్న ఈ అన్యాయాలను ప్రశ్నించే సంఘ సంస్కర్త కర్సందాస్ ముల్జీ (జునైద్ ఖాన్) చివరికి ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ.
జునైద్ ఖాన్ ప్రస్తుతం సాయి పల్లవితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహించబోతున్నాడు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.