Aadhi Pinisetty Divorce rumours | తమిళ నటుడు ఆది పినిశెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్ళైన మూడేండ్లకే తన భార్య నటి నిక్కీ గల్రానీ(Nikki Galrani)తో విడిపోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు ఆది పినిశెట్టి.
నటుడు ఆది పినిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం శబ్దం(Sabdham). సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వైశాలీ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు. అయితే రీసెంట్గా అతడిపై విడాకుల వార్తలపై ఆది స్పందించాడు.
నిక్కీ గల్రానీతో నేను విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు చూసి చాలా బాధపడ్డాను. పెళ్లి కాకముందు నిక్కీ నాకు మంచి స్నేహితురాలు. నా ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోయింది. ఇంట్లో వాళ్లకి కూడా నిక్కీ బాగా నచ్చడంతో తనతో ఉంటే సంతోషంగా ఉంటాను అనిపించింది. దీంతో ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతో మేము పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నాం. అయితే మేమిద్దరం విడిపోతున్నామని పలు యూట్యూబ్ ఛానల్స్‌లో కథనాలు వచ్చాయి. అవి చూసి చాలా కోపం వచ్చింది. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్, క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని పట్టించుకోవడం మానేశాను అంటూ ఆది వెల్లడించాడు.
ఆది పినిశెట్టి, నిక్కి గల్రానీ ఇద్దరూ ‘యాగవరైనమ్ నా కక్కా’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా 2015లో మలుపు పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మరకతమణి సినిమాలోనూ నటించారు. తమ ప్రేమ విషయాన్ని దాదాపు రెండేండ్లకు పైగా వీళ్లు సీక్రెట్‌గా ఉంచారు. అయినప్పటికీ ఇది బయటకు పొక్కింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో తమ లవ్ గురించి అటు ఆది.. ఇటు నిక్కి గల్రానీ ఇద్దరూ కన్ఫర్మ్ చేయడంతో పాటు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.