AAA | ఇప్పుడు ప్రముఖ పట్టణాలలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య క్రమేపి పెరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ టాప్ హీరోలు ఏషియన్‌తో కలిసి మల్టీపెక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మహేష్ బాబుకి సంబంధించిన ఏఎంబీ హైదరాబాద్‌లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ కూడా మల్టిప్లెక్స్ థియేటర్ల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న సత్యం థియేటర్ కాంప్లెక్స్‌ను తీసుకుని, సునీల్ నారంగ్ ఏషియన్ సినిమాస్ తో కలిసి ‘AAA’ (Triple A) పేరుతో మల్టిప్లెక్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ మల్టిప్లెక్స్ మంచి విజయం సాధించడంతో, అల్లు అర్జున్ ఇప్పుడు అదే ఫార్ములాను విశాఖపట్నంకి విస్తరిస్తున్నాడు. వైజాగ్ ఇన్ ఆర్బిట్ మాల్లో ఎనిమిది స్క్రీన్లతో కూడిన మల్టిప్లెక్స్ నిర్మాణానికి సరికొత్త ప్రణాళికలు రచించాడు. ఇప్పటికే పనులు మొదలైపోగా, వచ్చే వేసవి నాటికి ఈ థియేటర్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే మహేశ్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో కలిసి మల్లీప్లెక్స్ రంగంలోకి ప్రవేశించారు. వీరంతా ఇప్పుడు మల్టిప్లెక్స్ థియేటర్ల ఓనర్లుగా మారిపోయారు. అయితే అల్లు అర్జున్ ‘దిల్’ రాజు ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడుగుపెడుతుండడం చర్చనీయాంశంగా మారింది..
ఉత్తరాంధ్రలో దిల్ రాజు సినిమాల పంపిణీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాంటిది అల్లు అర్జున్ ..సునీల్ నారంగ్‌తో కలిసి వైజాగ్‌లో మల్టిప్లెక్స్ థియేటర్ నిర్మించడం, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలోను హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు అడ్డాలో అల్లు అర్జున్ జెండా పాతేయడం చూస్తుంటే వారి ప్లాన్స్ మాములుగా లేవని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో స్క్రీన్ కౌంట్ తక్కువై నిర్మాతలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, స్టార్ హీరోలు ఇలా స్క్రీన్స్ పెంచే ప్లాన్స్ చేస్తుండడం మల్టిప్లెక్స్ రంగానికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.