తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తాజా చిత్రం ‘లియో’ నుంచి ఇటీవల విడుదలైన ‘నా రెడీ’ అనే పాట వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలో విజయ్ పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా సిగరెట్ తాగుతూ కనిపించారని, అతని మీద మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త సెల్వం కోర్టును ఆశ్రయించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘లియో’ చిత్రంలోని ‘నా రెడీ’ అనే మాస్ గీతాన్ని ఇటీవల హీరో విజయ్ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. పాటలోని కొన్ని సన్నివేశాల్లో ఆయన సిగరెట్ తాగుతూ కనిపించడం వివాదానికి కారణమైంది. ఇటీవల పదోతరగతి విద్యార్థులతో హీరో విజయ్ నిర్వహించిన సమావేశంలో నైతిక విలువలు, క్రమశిక్షణ గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని, అలాంటి వ్యక్తి తన సినిమాల్లో చెడు వ్యసనాలను ప్రోత్సహించేలా ఎందుకు కనిపించాల్సి వచ్చిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ కేసు గురించి హీరో విజయ్ టీమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు విజయ్ అభిమానులు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. సినిమాను సినిమాగానే చూడాలని, నిజ జీవితంలో విజయ్‌కి ఎలాంటి చెడు అలవాట్లు లేవని గుర్తుచేస్తున్నారు.