సంగీత ప్రపంచంలో సరికొత్త ప్రయోగానికి నాంది పలుకుతూ, భావోద్వేగభరితమైన కథాంశంతో తెరకెక్కిన ‘కార్మేని సెల్వం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో, రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో మెరవనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాలను పంచుకుంటూ, సినీ సంగీత నిర్మాణంలో తాము ప్రవేశపెట్టిన వినూత్నమైన ‘మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్’ (MAAS) విధానం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సాధారణంగా ఒక సినిమాకు ఒక వ్యక్తి సంగీత దర్శకుడిగా ఉంటారు, కానీ ‘కార్మేని సెల్వం’ చిత్రానికి వ్యక్తి పేరుకు బదులుగా ‘మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ’ అనే సంస్థ పేరును సంగీత విభాగంలో ప్రకటించడం విశేషం. 2017లో బెంగళూరులో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా సంగీతాన్ని ఒక కార్పొరేట్ సేవలా అందిస్తున్నామని రామానుజన్ తెలిపారు. పెరుగుతున్న చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా, సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యకారులు మరియు ప్రోగ్రామర్లు అందరికీ రాయల్టీలో వాటా దక్కేలా ఒక వినూత్న ఆదాయ నమూనాను రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రక్రియ వల్ల నిర్మాతలపై భారం తగ్గడమే కాకుండా, పని చేసిన ప్రతి కళాకారుడికి తగిన గుర్తింపు, ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ప్రభంజనానికి దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలోని ‘అరెరె’ పాట ఇప్పటికే విడుదలయ్యి శ్రోతల మనసు గెలుచుకుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే గాఢమైన అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పాటలో వయోలిన్, ఫ్లూట్లకు బదులుగా ‘సరంగి’ వాయిద్యాన్ని ఉపయోగించడం ద్వారా భావోద్వేగాన్ని మరింత లోతుగా పండించగలిగామని రామానుజన్ పేర్కొన్నారు. దర్శకుడు రామ్ చక్రితో తనకున్న అనుబంధం ఈ సినిమాతో మరింత బలపడిందని, అలాగే నటులు సముద్రఖని, గౌతమ్ మీనన్ వంటి వారు తనకు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేవలం పేరు కోసం కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే సంగీతాన్ని అందించడమే తన లక్ష్యమని, భవిష్యత్తులో ‘హ్యాపీ డేస్’, ‘గోదావరి’ వంటి ఫీల్-గుడ్ చిత్రాలకు పని చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒక అద్భుతమైన టీమ్ వర్క్ ఫలితంగా రూపుదిద్దుకున్న ‘కార్మేని సెల్వం’ ప్రతి ఒక్కరి జీవితంలోని భావోద్వేగాలను తట్టిలేపుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.