జ్ఞాపకాలను తట్టిలేపే హృద్యమైన ప్రేమకథగా ‘96’ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఏడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రేమ్‌కుమార్ గతంలోనే వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలి భాగంలో సింగపూర్‌లో ఉన్న త్రిష చెన్నైకి వచ్చి తన పాఠశాల మిత్రుల్ని కలుస్తుంది. అక్కడ విజయ్ సేతుపతితో గత ప్రేమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య నడిచే భావోద్వేగపూరితమైన సంఘర్షణతో తొలిభాగం హార్ట్ టచింగ్‌గా సాగింది. కాగా రెండో భాగం కథ మాత్రం పూర్తిగా సింగపూర్, మలేషియా నేపథ్యంలో ఉంటుందట. సీక్వెల్ కూడా మనసును కదిలించే ఎమోషన్స్‌తో సాగుతుందని దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెలిపారు.