ఫణీంద్ర నర్సెట్టి… పేరు వినగానే ‘మను’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా ఒక ప్రయోగం. ఒరిజినల్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి ప్రముఖ సంస్థలో 8 వసంతాలు తీశాడు. మ్యాడ్ మూవీ ఫేం అనంతిక సనీల్ కుమార్ టైటిల్ రోల్ పోషించడం, ప్రచార చిత్రాల్లో స్వచ్చమైన ప్రేమకథ కనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఆ ఆసక్తి సినిమాలో కొనసాగిందా? ఈ కవితాత్మక ప్రేమకథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందో రివ్యూలో చూద్దాం.
కథ గురించి:
8 వసంతాలు చిత్రంలో కథ వెదకడం కంటే ఇదొక ప్రయాణం అని చెప్పడం సబబు. శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) పదిహేడు ఏళ్లకే ఓ పుస్తకం రాసి పేరుతెచ్చుకుంటుంది. అక్కడి నుంచి మరో ఎనిమిది ఏళ్లూ ఆమె జీవితంలో చోటుచేసుకున్న ప్రేమ, బ్రేకప్, బాధ్యతలు, త్యాగాలు… ఇలానే అనేక సంఘటనలు, పరిస్థితుల సమాహారమే ఈ సినిమా.
కథ విశ్లేషణ:
జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన మృదుత్వం కోల్పోకుండా ధైర్యంగా నిలబడిన ఓ అమ్మాయి కథే 8 వసంతాలు. ఒక ప్రేమకథకు కావాల్సిన మంచి సంగీతం, సాహిత్యం, విజువల్ బ్యూటీ… అన్నీ సినిమాకి వున్నాయి. ప్రధాన పాత్రలు రచయితలు కావడం వలన కథకు ఓ పోయెట్రీ టచ్ కూడా దొరికింది. ఆలోచింపజేసే సంభాషణలు కుదిరాయి.
కథా గమనం చూసుకుంటే తొలి సగం నెమ్మదిగా సాగుతున్నప్పటికీ ఎంగేజింగ్‌గా వుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌ని చక్కగా మలిచారు. అయితే సెకండ్ హాఫ్‌లో ప్రయాణం కాస్త అలసటగా సాగుతున్న భావన కలుగుతుంది. కథలో పెద్ద ప్రోగ్రెస్ కనిపించదు. కానీ క్లైమాక్స్ తీర్చిదిద్దిన తీరు బావుంది. ఫణీంద్ర నర్సెట్టి మరోసారి తన మార్క్ ని నిలబెట్టుకున్నాడు.
నటీనటుల నటన:
శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్ కుమార్ ఒదిగిపోయింది. చాలా పరిణితితో ఆ పాత్రను చేసింది. ఎనిమిదేళ్ల ప్రయాణంలో వయసుతో పాటు వచ్చే మార్పులను ఆ పాత్ర ప్రదర్శించిన తీరు చాలా సెటిల్డ్‌గా వుంటుంది. హను రెడ్డి హుందాగా కనిపించాడు. అనంతిక, హను రెడ్డి కెమిస్ట్రీ బావుంది. రవి దుగ్గిరాల నటన కూడా పర్వాలేదనిపిస్తుంది. కన్నా పసునూరి తన పాత్రకు తగ్గట్టుగా కనిపించాడు. మిగతా నటులు పరిధి మేర కనిపించారు.
టెక్నికల్‌గా:
నిర్మాణం పరంగా ఉన్నతంగా వుంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఒక్కో ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌లా ఉంటుంది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలు వినసొంపుగా వున్నాయి. దర్శకుడు మాటల రచయిత కూడా మెప్పించాడు. ఆయన రాసిన మాటల్లో మంచి ఘాడత వుంది. అయితే కొన్ని డైలాగులు ఫోర్స్డ్గా అనిపించే ఛాన్స్ కూడా వుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీపడలేదు. చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి. భావుకతతో కూడిన సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులకు 8 వసంతాలు మంచి ఆప్షన్.
ప్లస్ పాయింట్స్
శుద్ధి అయోధ్య పాత్ర
దర్శకుడి రైటింగ్, టేకింగ్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కథనంలో నెమ్మది
సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
రేటింగ్: 3/5