8 Vasantalu | కొందరు దర్శకులు ఒకే మూసలో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నారు. కాని కొందరు మాత్రం ఫీల్ గుడ్ మూవీస్‌తో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. స్వచ్చమైన ప్రేమ కథల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఎమోషన్స్‌తో కూడుకున్న సన్నివేశాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. తాజాగా ఫణీంద్ర నర్సెట్టి ఓ అందమైన, భావోద్వేగంతో కూడిన ప్రేమ కథను ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు మధురం షార్ట్ ఫిల్మ్, మను చిత్రాలతో రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా గ్యాప్ తరువాత ‘ 8 వసంతాలు ’ అనే సినిమాను తీశారు. ఈ చిత్రం జూన్ 20న రాబోతోంది.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదల కాగా, చూస్తుంటే ఇది.. అమ్మాయి ప్రేమ కథలో నుండి తీసిన సినిమాగా అర్ధమవుతుంది. అమ్మాయి వేదన, ఆమె బాధ అన్నింటిని చిత్రంలో చక్కగా చూపించనున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ మాత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. డైలాగ్స్ మాత్రం నేరుగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ‘చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. అంత్యక్రియలకు వాళ్లు పనికి రారు’..‘ఆడవాళ్లు పనికి రారా పేగు పంచి ప్రాణం పోయగలిగిన మేము.. చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా?’.. ‘నా ఆనందాన్ని, మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో కాకుండా మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాల్ని ఆస్వాధించడంలో వెతుక్కున్నా’..
‘ప్రేమ.. జీవితంలో ఒక దశ మాత్రమే.. అదే దిశ కాదు’..‘మగాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్య నగరాలున్నాయి.. ఆడదాని ప్రేమకేమున్నాయి.. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్పా’.. అనే డైలాగ్స్ సినిమాలోని డెప్త్ ఎలా ఉందో తెలియజేస్తుంది. మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్, న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రవితేజ దుగ్గిరాల , హను రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. హృద్యమైన పదాలతో సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతోంది.