ప్రేమకథలు ఎవర్గ్రీన్. ఇక వాటికి ఊటీలాంటి పర్వతప్రాంత నేపథ్యం తోడైతే కథలోని ఫీల్ మరింత రెట్టింపవుతుంది. మంచు జడిలో తడిసిన ప్రకృతి అందాలు ప్రేక్షకులను కనువిందు చేస్తాయి. ‘8వసంతాలు’ అలాంటి బ్యూటీఫుల్ పొయెటిక్ మూవీ అని చెబుతున్నారు మేకర్స్. ఇందులో ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రధారి. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు.
ఈ నెల 20న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘పరిచయమిలా..’ అంటూ సాగే మెలోడీసాంగ్ను విడుదల చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ పాటను సీనియర్ గాయని చిత్ర ఆలపించారు. ‘కనులకు తెలియని కలలను కంటు న్నా.. ఇదివరకెరుగని ఉదయం చూస్తున్నా ..పరిచయమిలా.. పరిమళములా మనసునంటి వదలదేలా..’ అంటూ అందమైన ప్రేమభావనలకు అద్దంపడుతూ ఈ పాట సాగింది. విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి.