‘సినిమాలపై నాకున్న ఇష్టం వల్లే కష్టాలు ఎదురైనా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటా. నా ధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించడానికే శ్రమిస్తా’ అని అన్నారు శ్రీరామ్ వేణు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో శ్రీరామ్‌వేణు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
నా అభిమాన హీరోల్లో పవన్‌కల్యాణ్ ఒకరు. నచ్చిన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకత్వం నాకు ఇష్టమైన పని కాబట్టి ఏ రోజూ ఒత్తిడిగా ఫీలవ్వలేదు. ప్రతి సినిమాకు ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి. పని ఒత్తిడి ఎదురవుతుంది. అది సహజం. ప్రతిరోజు సెట్స్‌లో పవన్‌కల్యాణ్‌ను చూడగానే ఆ టెన్షన్ మొత్తం మర్చిపోయేవాణ్ణి. పెదాలపై చిరునవ్వు ప్రత్యక్షమయ్యేది. హిందీలో విజయవంతమైన ‘పింక్’ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది తొలుత నా ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాననే విషయాన్ని పవన్‌కల్యాణ్‌ను కలిసి వివరించా. నేను చేసిన మార్పులు నచ్చడంతో ఆయన అంగీకరించారు. మహిళా సాధికారతను చాటిచెప్పే బాధ్యతతో కూడుకున్న చిత్రమిది. సామాజిక అంశాలకు పవన్‌కల్యాణ్‌కు ఉన్న స్టార్ ఇమేజ్ను జోడించి తెరకెక్కించాం. మూలకథలో పెద్దగా మార్పులు చేయలేదు. కోర్ట్‌రూమ్ డ్రామాగా ఆసక్తికరంగా సాగుతుంది.
ఏడేళ్లు ఖాళీగా ఉన్నా..
తొలి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. మొదటి సినిమాతోనే జీవితంలో పెద్ద పరాజయాన్ని చవిచూశా. తదుపరి అవకాశం రావడానికి ఏడేళ్లు నిరీక్షించా. తొలి సినిమా విషయంలో ఎదురైన తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని ‘ఎమ్సీఏ’ను కమర్షియల్ పంథాలో రూపొందించా. ఈ రెండు సినిమాల అనుభవం ‘వకీల్‌సాబ్’ విషయంలో చాలా ఉపయోగపడింది. తొలినాళ్లలో ఈ సినిమాకు దర్శకుడిని నేనే అని ప్రకటించగానే చాలా విమర్శలొచ్చాయి. పవన్ పునరాగమనానికి ఎలాంటి సినిమా ఎందుకు ఎంచుకున్నారు? ఇంతకంటే మంచి దర్శకుడు దొరకలేదా? అంటూ కామెంట్స్ చేశారు. ట్రైలర్ తర్వాత అందరికి నాపై నమ్మకం కలిగింది.
మగువా అనుకున్నాం..
స్టార్ సినిమా అయినా కథ లేకుండా ఆడదు. పవన్ రీఎంట్రీకి ఇంతకుమించిన మంచి కథ లేదన్నది నా అభిప్రాయం. ప్రేక్షకులు పవన్‌నుంచి ఇలాంటి బాధ్యతతో కూడిన సినిమాల్నే కోరుకుంటున్నారు. రికార్డుల గురించి నేను ఆలోచించడం లేదు. రికార్డుల వల్ల సినిమాలు ఎక్కువకాలం గుర్తుండవని నా నమ్మకం.తొలుత ఈ సినిమాకు మగువా.. లోకానికి తెలుసా నీ విలువా అనే టైటిల్ అనుకున్నాం. కానీ పవన్ అభిమానగణాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వకీల్‌సాబ్’ అనే టైటిల్ పెట్టాం. ఈ నెల 9 తర్వాతే తదుపరి సినిమాపై నిర్ణయానికి వస్తా. ‘ఐకాన్’ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.
ఇవి కూడా చదవండి:
ఆ క్షణం కళ్లల్లో నీళ్లు తిరిగాయి