Gulf Academy Movie Awards | తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గామా (Gulf Academy Movie Awards) 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్టు 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఘనంగా జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఆకట్టుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గామా సీఈఓ సౌరభ్ కేసరి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కర్టెన్ రైజర్ ఈవెంట్‌కు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గామా సీఈఓ సౌరభ్ కేసరితో పాటు వైభవ్ జ్యువెలర్స్ ఎండీ రాఘవ్, జ్యూరీ సభ్యులైన ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
ఈ అవార్డుల కార్యక్రమంలో భాగం కావడం పట్ల ఏ. కోదండరామిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. “ఇలాంటి అవార్డులు నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించేలా ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్నందుకు గామా చైర్మన్ త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరిని అభినందించారు.
దర్శకులు బి. గోపాల్ మాట్లాడుతూ, “గామా అవార్డ్స్ ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఈసారి సౌరభ్ కేసరి మరింత ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సినీ ప్రముఖుల సమక్షంలో హీరోయిన్ల అద్భుతమైన ప్రదర్శనలతో ఈ ఈవెంట్ జరగనుంది” అని తెలిపారు. వైభవ్ జ్యువెలర్స్ ఈసారి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించగా, రఘు కుంచె స్వరకల్పన చేసి పాడిన గామా 5వ ఎడిషన్ థీమ్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్, ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమాలు జరగనున్నాయి. సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీవిష్ణు, రోషన్, మీనాక్షి చౌదరి, దక్షా నాగర్కర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి వంటి హీరోయిన్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. బ్రహ్మానందం, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, వెన్నెల కిశోర్ వంటి ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా రానున్నారు. ఈ వేడుకలో సుమతో కలిసి వైవా హర్ష వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. గామా జ్యూరీ చైర్పర్సన్లుగా ఏ. కోదండరామిరెడ్డి, కోటి, బి. గోపాల్ వ్యవహరిస్తున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో వివిధ విభాగాలకు ఈ అవార్డులను అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.