2025 January Movies | కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చేసింది. అయితే 2024 ఏడాది సినిమా ప్రేక్షకులకు మంచి అనుభవాలను నింపి వెళ్లిన విషయం తెలిసిందే. గుంటూరు కారంతో మొదలైన కొత్త ఏడాది.. ఆ తర్వాత హన్ మాన్, కల్కి, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, పుష్ప 2 ది రూల్ వంటి సినిమాలతో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. అయితే ఈ ఏడాది కూడా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు అలరించబోతున్నాయి. ఈ క్రమంలోనే జనవరిలో బాక్సాఫీసు ముందుకు రానున్న చిత్రాలేవో చూసేద్దాం.
మార్కో
Marco
ఈ ఏడాది టాలీవుడ్లో తెలుగు సినిమా కాకుండా ఒక మలయాళం డబ్బింగ్ చిత్రం బోణీ కొడుతుంది. మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం మార్కో (Marco). హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. 5 రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను తెలుగులో జనవరి 01న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్.
‘ఐడెంటిటీ’
మలయాళ నటుడు టొవినో థామస్, సౌత్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘ఐడెంటిటీ’ (Identity). అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ సినిమాకు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. ఈ చిత్రం జనవరి 02న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గేమ్ ఛేంజర్
Game Changer
ప్రతి సంక్రాంతిలాగే ఈ సంక్రాంతి కూడా రసవత్తరంగా సాగబోతుంది. జనవరి 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో మొదలవ్వనున్న ఈ పోటీ తర్వాత వెంకటేశ్, బాలకృష్ణతో పాటు డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా వస్తుడటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
‘డాకు మహారాజ్’
Daku Maharaj
గేమ్ ఛేంజర్ వచ్చిన రెండు రోజులకే బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అంటూ వస్తున్నాడు బాలయ్య. బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో 2023 సంక్రాంతికి హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
సంక్రాంతికి వస్తున్నాం
Sankranthiki Vasthunam
సంక్రాంతి రేసులో ఉన్న మరో పెద్ద సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్‌కి ఎఫ్2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్లు అందించిన దర్శకుడు అనిల్ రావిపుడి మరోసారి జతకట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇవే కాకుండా హిందీ నుంచి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాని జనవరి 17న తీసుకురాబోతుండగా.. సోనూసూద్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘ఫతేహ్’ (Fateh) జనవరి 10న రిలీజ్ కానుంది.