శ్రీరామ్, అవికాగోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. ఈ నెల 24న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో హీరో శ్రీరామ్ చిత్ర విశేషాలను తెలిపారు.
తెలియక చేసిన తప్పుల వల్ల
పదో తరగతి విద్యార్థులు తిరిగి కలుసుకున్నప్పుడు ఎలాంటి అనుభూతులకు లోనయ్యారు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల్ని పదో తరగతి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. మనలో కొందరు తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. అలా ఓ వ్యక్తి చేసిన తప్పు వల్ల మిగతా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ చిత్ర కథ. ఈ అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం. పాత్రలన్నీ సహజమైన ధోరణిలో సాగుతుంటాయి. గతంలో ఇలాంటి కథతోనే ‘96’ అనే సినిమా వచ్చింది. కొన్ని సీన్లు గత చిత్రాల్లో చూసినట్లు అనిపించవచ్చు. దీనికి కారణం మన జీవితాల్లోని భావోద్వేగాలు దాదాపు ఒకేలా ఉండటమే. సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయితే కేవలం అందమైన దృశ్యాల గురించే ఆలోచిస్తాడు కానీ గరుడవేగ అంజి మంచి కథను ఈ సినిమా ద్వారా చెబుతున్నారు. అవికాగోర్, శ్రీనివాస రెడ్డి, అర్చన, హిమజ చేసిన పాత్రలన్నీ ఆకట్టుకుంటాయి.
రవితేజ సినిమాలో నటిస్తున్నా
కథ బాగుంటేనే సినిమా ఒప్పుకుంటున్నా. ప్రస్తుతం తమిళంలో ఆరు చిత్రాల్లో నటిస్తున్నా. ఓ వెబ్ సిరీస్ చేశా. తెలుగులో అతిథి పాత్రలకు అడిగితే ఒప్పుకోవడం లేదు. ఇలాంటివి చేస్తే టైప్ కాస్టింగ్ చేస్తారు. రవితేజ ‘రావణాసుర’ చిత్రంలో అతిథి పాత్రే. అయితే ఆ పాత్ర బాగా వచ్చింది. అందుకే అంగీకరించాను.