Zoho Sridhar Vembu | రెండేండ్ల క్రితం ఓపెన్ ఏఐ అనే స్టార్టప్ సంస్థ తీసుకొచ్చిన ఏఐ బేస్డ్ చాట్‌జీపీటీ (ChatGPT)తో టెక్నాలజీ వరల్డ్ రూపురేఖలే మారిపోయాయి. అప్పటికే మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి టూల్స్ .. ఐటీ, టెక్నాలజీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ్లోబల్ ఐటీ దిగ్గజాల నుంచి దేశీయంగా సాదాసీదా ఐటీ కంపెనీల వరకూ ప్రతి సంస్థ కూడా తమకు సొంతంగా ఏఐ టూల్ డెవలప్మెంట్పై దృష్టి పెడుతున్నాయి. అంతర్గతంగా ఐటీ నిపుణులకు ఏఐ బేస్డ్ ట్రైనింగ్ అందిస్తున్నాయి. ఈ దిశగా మరో ఐటీ కంపెనీ .. క్లౌండ్ ఆధారిత సేవలందిస్తున్న జోహో (Zoho) కీలక నిర్ణయం తీసుకున్నది.
జోహో (Zoho) సీఈఓగా ఉన్న శ్రీధర్ వెంబూ (Sridhar Vembu).. ఆ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్స్ వైపు.. అంటే జోహో చీఫ్ సైంటిస్ట్ (Zoho Chief Scientist) గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తన స్ఠానంలో కంపెనీ సీఈఓగా మరో కో-ఫౌండర్ శైలేష్ కుమార్ దవేయ్ (Sailesh Kumar Davey) బాధ్యతలు స్వీకరిస్తారని శ్రీధర్ వెంబూ సోమవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఇటీవల వచ్చిన ప్రధాన డెవలప్మెంట్స్తోపాటు మాకు ఎదురవుతున్న వివిధ సవాళ్లు, అవకాశాలపై దృష్టిని కేంద్రీకరిస్తాం. ఇందుకోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంది. వ్యక్తిగత గ్రామీణ అభివృద్ధి మిషన్‌తోపాటు కంపెనీ ఆర్ అండ్ డీ పై దృష్టి కేంద్రీకరిస్తా’ అని చెప్పారు.