WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. మోటా యాజమాన్యంలోని ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తున్నది. 2024 సంవత్సరంలో కీలకమైన ఫీచర్స్‌ను పరిచయం చేసింది. ఆ ఫీచర్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం..!
వాట్సాప్ 2024లో తొలిసారిగా మెటా ఏఐ చాట్‌బాట్‌ని ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ఏఐని పరిచయం చేసింది. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ చాట్మాట్ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఇమేజ్‌లను రూపొందించడంతో పాటు అనేక ఆసక్తికరమైన పనులు చేస్తుంది. మెటా ఏఐ సహాయంతో టెక్స్ట్ అందిస్తే ఏఐ ఇమేజ్‌ని రూపొందిస్తుంది. క్వాలిటీ తగ్గకుండా ఇమేజ్‌ని జనరేట్ చేస్తుంది.
ఇది వరకు మనకు ఏదైనా పోస్ట్ కానీ ఫొటోస్ నచ్చితే ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ సెక్షన్‌ని ని యూస్ చేసేవాళ్ళం అలాగే వాట్సాప్‌లో కూడా ఇప్పుడు ఒక ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించి మనకు నచ్చిన స్టేటస్‌కి లైక్‌ని టాప్ చేయవచ్చు. ఇది వరకు మనం వాట్సాప్‌లో ఎవరైనా మంచి ఫొట్స్, వీడియోలు, కొట్స్ షేర్ చేస్తే చూసి రిప్లై చేసేవాళ్ళం. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం లైక్, షేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఇప్పుడు వాట్సాప్‌లో చేయవచ్చు.
వీడియో కాల్స్ చేయడానికి ఇష్టపడే వారి కోసం కొత్త ఫిల్టర్స్‌ను జోడించింది. ఈ ఫిల్టర్లు మీ వీడియో కాల్‌లను మరింత సరదాగా చేస్తాయి. వీడియో కాల్స్‌కు మూడు కొత్త ఫీచర్లను యాడ్ చేసి జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌కు పోటీగా నిలిచింది. అయితే వాట్సాప్ కాల్స్‌కు ఇంకొన్ని ఫీచర్లను కూడా యాడ్ చేయాలని చూస్తోంది. ఏఆర్ కాల్ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్, బ్యాక్‌గ్రౌండ్ చేంజింగ్ ఉన్నది.
వాయిస్ సందేశాలను టెక్స్ట్‌గా మార్చే మరో అద్భుతమైన ఫీచర్‌ని పరిచయం చేసింది. మీరు వాయిస్ సందేశంలో ఏమి చెప్పారో.. మీరు ఆడియోను వినే స్థితిలో లేనప్పుడు, ముఖ్యమైన సమాచారాన్ని రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వాట్సాప్ డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త ఇంటర్ఫేస్ని ఒక చేత్తో ఉపయోగించినా మనకు ఎలాంటి సమస్యా రాదు. ఇప్పటి వరకు వాట్సాప్ రూపొందిస్తున్న ఈ ఇంటర్ఫేస్ టెస్టింగ్‌లో ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ట్యాబ్లన్నింటితో పాటు కొత్త సింబల్స్ కూడా కనిపిస్తాయి. కొత్త అప్డేట్తో అతిపెద్ద మార్పు ఏమిటంటే, దీన్ని ఒక చేతితో ఉపయోగిస్తున్నప్పటికీ, వినియోగదారులు వివిధ ట్యాబ్‌ల మధ్య సులభంగా మారవచ్చు.
వాట్సాప్ ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్స్‌లో కస్టమ్ లిస్ట్ ఒకటి. వాట్సాప్ ఓపెన్ చేయగానే బోలెడు కాంటాక్ట్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, వ్యక్తిగత చాట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన చాట్స్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక తరచూ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కస్టమ్ లిస్ట్ ద్వారా ఫిల్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కమ్యూనికేషన్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది.