ప్రపంచ శ్రీమంతుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌


ముంబై, మే 26: ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్‌ గ్రూప్‌ ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ అగ్రస్థానాన్ని అందుకున్నారు. ఎల్‌వీఎంహెచ్‌ షేరు ధరలు జోరుగా పెరిగిన నేపథ్యంలో అమెజాన్‌ హెడ్‌ జెఫ్‌ బెజోస్‌ స్థానాన్ని ఆర్నాల్డ్‌ ఆక్రమించారు. ఆ రోజున ఆర్నాల్డ్‌ సంపద 186.3 బిలియన్‌ డాలర్లుకాగా, బెజోస్‌ సంపద 186 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ చూపించింది. అయితే ఈ వార్తరాసే సమయానికి బెజోస్‌ మళ్లీ 188.2 బిలియన్‌ డాలర్లతో టాప్‌లోకి చేరగా, ఆర్నాల్డ్‌ 187.3 బిలియన్‌ డాలర్లతో ద్వితీయస్థానంలో వున్నారు. 152.5 బిలియన్‌ డాలర్లతో ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మూడోస్థానంలో వుండగా, మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ 126 బిలియన్‌ డాలర్లతో, ఫేస్‌బుక్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ 117.7 బిలియన్‌ డాలర్లతో తదుపరిస్థానాల్లో వున్నారు. 77.3 బిలియన్‌ డాలర్లతో ఇండియాకు చెందిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలోనూ, 68.8 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదాని 16వ స్థానంలోనూ కొనసాగుతున్నారు.