బెంగళూరు, జూలై 19: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,003.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే 4.6 శాతం వృద్ధి కనబరిచినట్లు పేర్కొంది. కానీ, కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 3.8 శాతం తగ్గి రూ.21,963.8 కోట్లకు పరిమితమైంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పిైల్లె మాట్లాడుతూ..ఈ ఏడాది లాభాలతో ఆరంభించినట్లు, ముఖ్యంగా బిలియన్ డాలర్ల కంటే అతి విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బీమా(బీఎఫ్ఎస్ఐ), కన్జ్యూమర్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 10-12 వేల మంది సిబ్బందిని క్యాంపస్‌లతోపాటు ఇతర మార్గాల ద్వారా నియమించుకునే ఆలోచనలో విప్రో ఉన్నది. తొలి త్రైమాసికంలో 337 మంది చేరడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కి చేరుకున్నారు.