న్యూఢిల్లీ, జనవరి 13: సహ సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ తరహాలోనే విప్రో ఆర్థిక ఫలితాలు సైతం విశ్లేషకుల అంచనాల్ని మించాయి. 2022 డిసెంబర్ త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విప్రో నికర లాభం 2.8 శాతం వృద్ధిచెంది రూ. 3,053 కోట్లకు చేరగా, ఆదాయం 14.3 శాతం వృద్ధితో రూ. 23,229 కోట్లకు పెరిగింది. సంస్థ లాభం రూ. 2,950 కోట్లు, ఆదాయం 23,180 కోట్ల మేర ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో పోలిస్తే కంపెనీ లాభం భారీగా 15 శాతం పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఐటీ సర్వీసుల వ్యాపారం 11.5-12 శాతం వృద్ధిచెందవచ్చని విప్రో గైడెన్స్‌లో తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో 4.3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను కంపెనీ సాధించింది. తాము మార్కెట్ వాటాను పెంచుకుంటున్నామని, సూక్ష్మ ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించేలా సహకరించమంటూ క్లయింట్లు తమను కోరుతున్నారని విప్రో సీఈవో థెర్రీ డెలాపోర్టే చెప్పారు. తమ సిబ్బంది వేతనాల పెంపు, ప్రమోషన్లు, సీనియర్ మేనేజ్మెంట్కు దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు అందించినప్పటికీ, ఆపరేటింగ్ లాభాల మార్జిన్‌ను 120 బేసిస్ పాయింట్ల మేర పెంచుకున్నామని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ చెప్పారు. ఉద్యోగుల వలసల రేటు తగ్గుతున్నదని, సెప్టెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌కల్లా ఈ రేటు 180 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 21.2 శాతానికి దిగివచ్చిందని వివరించారు.