Repo Rate Cut | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను బుధవారం రిజర్వ్ బ్యాంక్ 4.2 శాతం నుంచి 4శాతానికి తగ్గించింది. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, ముడి చమురు ధరల తగ్గుదలను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బ్యాంక్ ఈ చర్యలు తీసుకున్నది. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారిత ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2025 జనవరి-ఫిబ్రవరి కాలంలో 1.6 శాతం పాయింట్లు తగ్గి.. 2024 డిసెంబర్లో 5.2 శాతం నుంచి 2025 ఫిబ్రవరిలో 3.6 శాతానికి తగ్గింది. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ట స్థాయి 3.8 శాతానికి తగ్గింది.
2025-25 ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ.. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఆహార ద్రవ్యోల్బణం రేటు నిర్ణయాత్మకంగా సానుకూలంగానే ఉందని తెలిపారు. మెరుగైన వాతావరణం కారణంగా కూరగాయల ధరలు గణనీయంగా మెరుగుపడ్డాయని.. ద్రవ్యోల్బణం విషయంలో, ఆహార ద్రవ్యోల్బణంలో ఊహించిన దానికంటే వేగంగా తగ్గుదల ఉపశమనం ఇచ్చినప్పటికీ.. ప్రపంచ అనిశ్చిత నేపథ్యంలో జాగ్రత్తగా ఉన్నట్లు పేర్కొన్నారు. రబీ పంటలకు సంబంధించిన అనిశ్చిత గణనీయంగా తగ్గిందని, రెండవ ముందస్తు అంచనాలు గోధుమ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుందని, ప్రధాన పప్పుధాన్యాల ఉత్పత్తి సైతం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కారణంగా ఆహార ద్రవ్యోల్బణం శాశ్వతంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు గవర్నర్ చెప్పారు.
ద్రవ్యోల్బణాన్ని తగ్గడంలో ముడి చమురు ధరల తగ్గుముఖం పట్టడం సైతం కీలకమైందని ద్రవ్య విధాన కమిటీ (MPC) తన 2025-26 తీర్మానంలో పేర్కొంది. మరోవైపు, ప్రపంచ మార్కెట్లో అనిశ్చితులు కొనసాగుతాయని, ప్రతికూల వాతావరణ సంబంధిత సరఫరా అంతరాయాలు తిరిగి తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుందని.. సాధారణ రుతుపవనాలు సమయంలో సాధారణ వర్షాపాతం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం మొదటి త్రైమాసికంలో 3.6 శాతం, రెండవ త్రైమాసికంలో 3.9 శాతం, మూడవ త్రైమాసికంలో 3.8 శాతం, నాల్గవ త్రైమాసికంలో 4.4 శాతంగా ఉంటుంది. ప్రభుత్వం వచ్చే వారం రిటైల్ ద్రవ్యోల్బణ డేటాను విడుదల చేయనున్నది.