TimCook On WHO | కరోనా కట్టడికి అమల్లోకి తెచ్చిన వర్క్ ఫ్రం హోం సంస్కృతి స్థానే వర్క్ ఫ్రం ఆఫీస్ కల్చర్ పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. గతేడాది ఉధృతంగా సాగిన రెండో వేవ్ తర్వాత కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలవడం.. కొవిడ్-19 కేసులు పెరిగి మళ్లీ ఆ ప్రతిపాదన వెనక్కు వెళ్లడం జరుగుతున్నది. ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఆఫీసులకు మళ్లించేందుకు ఆయా సంస్థల యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ తరుణంలో వరల్డ్ టెక్ జెయింట్ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం/ వర్క్ ఫ్రం ఆఫీసుకు బదుల మధ్యేమార్గాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
వర్క్ ఫ్రం హోం/ వర్క్ ఫ్రం ఆఫీసుకు మధ్యేమార్గంగా సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల జరిగిన టైమ్-100 సమ్మిట్‌లో టిమ్ కుక్ చెప్పారు. అయితే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై తాము దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. గత కొన్నేండ్లుగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యంగా మారిందన్నారు.
కరోనాకు ముందు ప్రతి ఒక్కరూ ఫిజికల్ పిట్నెస్పై శ్రద్ధ వహించే వారని టిమ్‌కుక్ అన్నారు. కరోనాతో వచ్చిన పలు రకాల సమస్యలు ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపాయి. భౌతికంగా ఫిట్‌గా ఉండటంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనన్నారు. మానసిక ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో దాన్నే అమలు చేస్తే సరిపోతుందన్నారు.
తనకు వ్యక్తిగత సంబంధాలంటేనే ఎక్కువ ఇష్టం అని టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. కనుక వర్క్ ఫ్రం ఆఫీసుకే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలిచ్చారు. అదే సమయంలో వర్క్ ఫ్రం హోం (వర్చువల్)అంటే వర్క్ ఫ్రం ఆఫీస్ కంటే తక్కువేం కాదని, అదో భిన్నమైన పని విధానం అన్నారు. ప్రస్తుతం ఆపిల్‌లో ప్రతి ఉద్యోగి వారానికి రెండు రోజులు ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది.