WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’.. తన యూజర్ల కోసం నిత్యం కొత్త కొత్త ఫీచర్లు తెస్తున్నది. తాజాగా మరో రెండు ఫీచర్లు.. ఈ-మెయిల్, ఏఐ అసిస్టెంట్ ఫీచర్లు తెచ్చింది. ఆ ఫీచర్లు ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ-మెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఈ-మెయిల్ ఐడీని వాట్సాప్ ఖాతాకు జత చేయొచ్చు. ఎప్పుడైనా యాప్‌లో లాగిన్ సమస్య తలెత్తి ఎస్ఎంఎస్ రాకపోతే.. ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. ఇప్పటికైతే ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు వినియోగంలోకి వస్తుంది. అయితే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ మెనూలో ఈ-మెయిల్ అడ్రస్ జత చేయాలి. వెరిఫికేషన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఫీచర్ ఉపయోగంగా ఉంటుంది.
వాట్సాప్‌లో ఇంతకుముందే ఏఐ అసిస్టెంట్ ఫీచర్ తెస్తామని ప్రకటించిన మెటా.. ప్రస్తుతం అమెరికాలోని కొందరు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. చాట్ సెక్షన్ మీద వివిధ రంగులతో కూడిన చాట్ బోట్ బటన్ దర్శనం ఇస్తున్నది. ఈ చాట్‌బోట్ ఫీచర్ ఎలా ఉపయోగిస్తారన్న సంగతి తెలియకున్నా రియల్ టైం వెబ్ రిజల్ట్స్‌ను అందిస్తుందని సమాచారం. టెక్ట్స్ నుంచి ఇమేజ్ తయారు చేయడానికీ ఉపకరిస్తుంది.