Recurring Deposit | పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. దాని కాలపరిమితి ఐదేండ్లుంటుంది. అయితే ఈలోగా ఏదైనా అత్యవసరంగా నిధులు కావాల్సి వచ్చి సదరు ఆర్డీ ఖాతాను ఉపసంహరించుకోవాలంటే ఏం చేయాలి? నిబంధనలు ఎలా ఉంటాయి? వీటిని ఒక్కసారి పరిశీలిస్తే..
తపాలా కార్యాలయ రికరింగ్ డిపాజిట్ ఖాతాలను.. మొదలుపెట్టిన మూడేండ్ల తర్వాత నిర్ణీత గడువు తీరకముందే ఉపసంహరించుకోవచ్చు. అంటే మూడేండ్లు పూర్తయితే ఐదేండ్లదాకా ఆగనవసరం లేదు. ఇక నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ రూల్స్ 2019 ప్రకారం ఫామ్-2లో అకౌంట్స్ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆర్డీ ఖాతాను తెరిచిన పోస్టాఫీస్కే ఈ దరఖాస్తును ‘ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్’గా అందివ్వాల్సి ఉంటుంది. అయితే అడ్వాన్స్ డిపాజిట్ చెల్లింపులుంటే వాటి కాలవ్యవధి ముగిసేదాకా ఆర్డీ ఖాతాను ముందస్తుగా మూసివేయలేం. కాగా, ఈ నెల 22న పోస్టాఫీస్ వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. మెచ్యూరిటీకి ఒక్కరోజు ముందుగా ఖాతాను మూసేసినా దానికి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేటే వర్తిస్తుంది.