హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ)ల స్థాపన, విస్తరణలో హైదరాబాద్ నగరం దూసుకుపోతున్నది. ఈ క్రమంలో భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరును సైతం దాటేసింది. ఏండ్ల తరబడి బహుళజాతి కంపెనీల చూపును కట్టిపడేసిన బెంగళూరు.. ప్రస్తుతం హైదరాబాద్ ముంగిట నిలువలేకపోతున్నది. ఇప్పుడు దేశంలోని జీసీసీల్లో సుమారు సగం బెంగళూరులోనే ఉన్నాయన్నది ఎంత నిజమో.. ఇకపై కొత్తగా ఏర్పాటు కాబోతున్నవి హైదరాబాద్లోనేనన్నది అంతే నిజం. అవును.. జీసీసీ నిర్వాహక సంస్థలు తెలంగాణ రాజధానికి క్యూ కడుతున్నాయి మరి. కొత్తవాటి ఏర్పాటులోనైనా.. ఇప్పటికే ఉన్నవాటి విస్తరణలోనైనా.. హైదరాబాద్ దూకుడును ప్రదర్శిస్తున్నదిప్పుడు. విస్తరణ అంటూ వినపడితే హైదరాబాదే తమ తొలి ఎంపికని దేశ, విదేశీ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
అక్కడ 13.. ఇక్కడ 23
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో బెంగళూరు 13 జీసీసీలను ఆకర్షిస్తే.. హైదరాబాద్ 23 జీసీసీలను ఆకట్టుకున్నదని అంతర్జాతీయ రిసెర్చ్ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ తాజా నివేదిక తేల్చింది. కొత్త వాటిలోనే కాదు.. విస్తరణలోనూ హైదరాబాద్ ముందే ఉన్నది. బెంగళూరులో ఇప్పటికే ఉన్న జీసీసీల్లో మూడు విస్తరణ పనుల్లో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లోని జీసీసీల్లో నాలుగు విస్తరణ బాట పట్టాయి. నిజానికి బెంగళూరులో ఇక అభివృద్ధికి ఆస్కారం లేదని, కానీ హైదరాబాద్‌లో అందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. భారీ పెట్టుబడులతో హైదరాబాద్ అంతకంతకూ పెరుగుతూపోతున్నదని గుర్తుచేస్తున్నాయి.
గొప్ప ప్రత్యామ్నాయం
మౌలిక సదుపాయాలపరంగా హైదరాబాద్ బాగుంటుందని, ఇదే అంతర్జాతీయ కంపెనీలను తమ జీసీసీల ఏర్పాటుకు నగరాన్ని ఎంచుకునేలా ప్రేరేపిస్తున్నదని ఏఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ సీఈవో లలిత్ అహూజా తెలిపా రు. వాస్తవానికి ఐటీ, ఫార్మా రంగాలతోపాటు ఏవియేషన్, రియల్టీ రంగాలకు హైదరాబాద్ ఇప్పటికే పేరుగాంచింది. అయితే ఇప్పుడు జీసీసీ సెంటర్ల ఏర్పాటుకూ హైదరాబాదే ప్రధాన కేంద్రంగా ఆవిర్భవిస్తున్నదని అహూ జా అన్నారు. బయోటెక్, టెక్నాలజీ, ఆర్థిక సేవలతోపాటు ఆటో రంగంలో వృద్ధి ఇందుకు దోహదం చేస్తున్నదని చెప్పారు. ఎవరెస్ట్ గ్రూప్ సైతం ఏరోస్పేస్, తయారీ, రిటైల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లోని ఫార్చూన్ 500 కంపెనీలు.. హైదరాబాద్పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొన్నది.
టీ-హబ్, జీనోమ్ వ్యాలీ..
రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో అభివృద్ధి చేసిన టీ-హబ్, జీనోమ్ వ్యాలీ.. జీసీసీల ఏర్పాటుకు కలిసొస్తున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ అనుకూల, స్నేహపూర్వక విధానాలు, ముఖ్యం గా మంత్రి కేటీఆర్ కార్పొరేట్ దిగ్గజాలతో జరుపుతున్న సమావేశాలు.. ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా మాండీ హోల్డింగ్స్, స్టోరబుల్, రైట్ సాఫ్ట్వేర్, టెక్జెన్స్, జాప్‌కామ్, చార్లెస్ స్కాబ్ కార్పొరేషన్ తదితర ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో కొత్త కేంద్రాల ఏర్పాటు, ఉన్న కేంద్రాల విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రథమార్ధంలో 40కిపైగా అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ యాక్సిలరేషన్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, ఇన్నోవేషన్ కేంద్రాలు, ఆర్అండ్డీలను ఏర్పాటు చేసినట్టు ఎవరెస్ట్ గ్రూప్ వివరించింది. కొత్త జీసీసీల స్థాపన, విస్తరణతో హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయని, 2021-22లో దేశంలోని మొత్తం ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్ వాటా 33 శాతం నుంచి 44 శాతానికి పెరిగిందన్నది. అదే సమయంలో వివిధ రంగాలకు సంబంధించి నగరంలో పెట్టుబడులు గణనీయంగా రావడం వల్ల ఐటీయేతర ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగినట్టు ఎవరెస్ట్ తెలిపింది.
హైదరాబాద్‌కున్న అనుకూలతలు..
హైదరాబాద్‌లో చాలా పెద్ద టెక్ కమ్యూనిటీ ఉన్నది. ఎన్నో భారీ టెక్ ప్రొడక్ట్ కంపెనీలకు నగరం నిలయం. ఇక్కడ నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థలున్నాయి. దీంతో కొత్తవారు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. పైగా నగర విస్తరణకు అనుకూలంగా చుట్టూ ఖాళీ స్థలాలు ఉండటం హైదరాబాద్‌కు సువర్ణావకాశంగానే చెప్పాలి.
-లలిత్ అహూజా,
ఏఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ సీఈవో
బెంగళూరుకు ఇప్పుడు హైదరాబాద్, పుణె నగరాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌కే కంపెనీలు మొగ్గుతున్నాయి. ప్రతిభ, నైపుణ్యం కలిగిన యువతతోపాటు చక్కని మౌలిక వసతులు, అనువైన వ్యాపార పరిస్థితులు, దేనికైనా ఖర్చు తక్కువగా ఉండటం ఇక్కడికొచ్చే సంస్థలకు కలిసొస్తున్నది.
-ఆరిందమ్ సేన్,ఈవై ఇండియా పార్ట్నర్
వ్యాపార కేంద్రాలను ప్రారంభించడానికి భారత్‌కు వచ్చే బహుళజాతి సంస్థలకు బెంగళూరే గమ్యస్థానం.
అయితే ఇది ఒకప్పుడు.. ఇప్పుడు ఆ స్థానాన్ని హైదరాబాద్ భర్తీ చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలకు అసలు సిసిలైన చిరునామా హైదరాబాదే మరి.ఈ ఏడాది మొదలు రాష్ట్ర రాజధాని నగరానికి వచ్చిన గ్లోబల్
కేపబిలిటీ సెంటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. దాదాపు బెంగళూరుకు రెట్టింపు స్థాయిలో జీసీసీలు హైదరాబాద్‌కు వరుస కట్టాయి. ఇప్పటికే ఉన్న వాటి విస్తరణలోనూ హైదరాబాద్‌దే పైచేయి.