WE HUB | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వీ హబ్ సీఈవో పల్లచోళ్ల సీత తెలిపారు. శుక్రవారం వీ హబ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళ పారిశ్రామికవేత్తలకు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక ప్రభావంపై అవగాహన కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
వ్యాపార రంగంలోకి అడుగుపపెట్టే మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వ్యాపార అభివృద్ధి, పెట్టుబడులు, నెట్వర్కింగ్, శిక్షణ, మెంటరింగ్ వంటి సేవలను వీ హబ్ అందిస్తున్నట్లుగా తెలిపారు. మహిళల నేతృత్వంలోనే పరిశ్రమలను పునర్నిర్మించడానికి అవసరమైన వనరులను అందించాలని ఇప్పటికే సోషల్ ఇంపాక్ట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్, అర్బన్ ఇన్నోవేషన్ విభాగాలను నెలకొల్పినట్లుగా తెలిపారు.