హైదరాబాద్, నవంబర్ 17 : సరుకులు నిల్వ చేయాల్సిన అవసరం లేదు..అంతేకాదు పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయవచ్చునని డిజిటల్ కామర్స్ సేవల సంస్థ డబ్ల్యూకామర్స్ వెల్లడించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకొని చిరు వ్యాపారులు, వ్యక్తులు ఎవరైనా వ్యాపారం ప్రారంభించుకోవచ్చును. విక్రేతల పేరుతో కంపెనీ ఒక ఆన్లైన్ స్టోర్‌ను క్రియేట్ చేస్తున్నది. సోషల్ మీడియాలో ఈ ఆన్లైన్ స్టోర్‌కు సంబంధించి లింక్/క్యూఆర్‌కోడ్‌ను పోస్ట్ చేయడం లేదా బందువులు, స్నేహితులకు షేర్ చేసిన చాలు.
కంపెనీ ఆఫర్ చేసే ఉత్పత్తులను ఎవరు కొనుగోలు చేసినా..విక్రేతకు 20-40 శాతం వరకు లాభం రానున్నది. ఇలా బుకింగ్ చేసుకున్న వస్తువుల డెలివరీ బాధ్యతలను కంపెనీ తీసుకుంటుందని డబ్ల్యూకామర్స్ కో-ఫౌండర్, సీవోవో శ్రీధర్ శ్రీరామనేని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా యాక్టివ్ ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయన్నారు. హెల్త్, వెల్నెస్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ ఎసెన్షియల్ విభాగాలకు చెందిన 40కి పైగా బ్రాండ్ నుంచి 600కి పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.