ఫ్రాంక్ఫర్ట్: స్వీడెన్కు చెందిన వోల్వో(Volvo) కార్ల కంపెనీ సుమారు మూడు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నది. ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నది. వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చిత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొన్నది. స్వీడెన్‌లో ఉన్న సుమారు 1200 మంది వర్కర్లను తొలగించనున్నారు. ఇక ఆ దేశంలోనే పనిచేస్తున్న మరో వెయ్యి మంది కన్సల్టెంట్లను కూడా తొలగించేందుకు ఆ కంపెనీ నిర్ణయించింది.
ఇక మిగితా జాబ్‌లన్నీ ఇతర దేశాల్లో ఊడనున్నాయి. ఎక్కువ శాతం ఆఫీసు పొజిషన్లలో ఉన్నవారిని తొలగిస్తారు. తాము ప్రకటించిన నిర్ణయాలు కష్టమైనవని, కానీ బలమైన నిర్మాణంచేపట్టేందుకు అవే కీలకమైన అడుగులు అని వోల్వో కార్ల కంపెనీ సీఈవో హకన్ సామ్యుల్సన్ తెలిపారు. ఆటోమోటివ్ పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటున్నదని, నగదు రాకను పెంచాలని, అదే విధంగా ఖర్చులను తగ్గించాలన్నారు.