Vodafone Idea | తాము తాజాగా ఎస్బీఐ నుంచి రుణం తీసుకునే విషయమై ఎటువంటి పురోగతి లేదని ప్రైవేట్ టెలికం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా (వీఐ) సోమవారం వివరణ ఇచ్చింది. ఎస్బీఐతోపాటు తమ ప్రధాన బ్యాంకుల వద్ద నుంచి రుణాల ద్వారా నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. తమ ప్రధాన బ్యాంకర్లలో ఎస్బీఐ ఒకటని తెలిపింది. ఈ విషయమై సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా సమాచారం ఇస్తామని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా ఇండియా యూనిట్.. దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి రుణం తీసుకోనున్నదని బ్లూంబర్గ్ పేర్కొంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాను ముందుగా నష్టాల నుంచి బయటపడేందుకు పూర్తి కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఎస్బీఐ కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.14,451 కోట్ల నష్టాల్లో చిక్కుకున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది.