న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న విశాల్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ముంబై ఆధారిత బజాజ్ కన్జ్యూమర్ కేర్ లిమిటెడ్ సొంతం చేసుకుంటున్నది. రెండు విడుతల్లో జరుగనున్న ఈ డీల్ విలువ రూ.120 కోట్లుగా అంచనా వేస్తున్నారు. విశాల్ పర్సనల్ కేర్‌లో తొలుత 49 శాతం వాటాను, ఆ తర్వాత మిగతా 51 శాతం వాటాను బజాజ్ కన్జ్యూమర్ కేర్ కొనుగోలు చేయబోతున్నది. ఇక విశాల్ పర్సనల్ కేర్‌లో 2012లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పీపుల్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఈ వాటాలనూ బజాజ్ కన్జ్యమర్ కేర్ కొనాల్సి ఉన్నది. కాగా, ప్రస్తుతం మార్కెట్లో బంజారా బ్రాండ్ పేరిట వివిధ శిరోజ, చర్మ సంరక్షణ ఉత్పత్తులను విశాల్ పర్సనల్ కేర్ విక్రయిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజా లావాదేవీ పూర్తయితే ఈ బ్రాండ్ బజాజ్ కన్జ్యూమర్ కేర్ గూటికి వెళ్లిపోనున్నది. ‘ఐదు దక్షిణాది రాష్ర్టాల్లో బజాజ్ కన్జ్యూమర్ కేర్ వ్యాపార కార్యకలాపాల బలోపేతానికి విశాల్ పర్సనల్ కేర్ కొనుగోలు వ్యూహాత్మకంగా కలిసిరాగలదు’ అని ఈ సందర్భంగా బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఎండీ జైదీప్ నంది అన్నారు. శుక్రవారం జరిగిన తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో విశాల్ పర్సనల్ కేర్ కొనుగోలుకు ఆమోదం లభించినట్టూ ఆయన చెప్పారు. ఇక గత ఆర్థిక సంవత్సరం (2023-24) విశాల్ పర్సనల్ కేర్ రెవిన్యూ రూ.51 కోట్లుగా ఉన్నది. దీన్ని 1991లో స్థాపించారు.
హెర్బల్ పౌడర్లు, అలోవెరా జెల్స్, షాంపూలు, హెయిర్ కేర్ పౌడర్లు అమ్ముతున్నది. ఏపీ, తెలంగాణసహా ఐదు దక్షిణాది రాష్ర్టాల్లో దీనికి 70వేలకుపైగా ఔట్‌లెట్లున్నాయి. ఇదిలావుంటే కుషగ్ర బజాజ్ నేతృత్వంలోని 2.5 బిలియన్ డాలర్ల విలువైన బజాజ్ గ్రూప్‌లోగల ఎఫ్ఎంసీజీ కంపెనీయే బజాజ్ కన్జ్యూమర్ కేర్. గత ఆర్థిక సంవత్సరం దీని ఆదాయం రూ.967.71 కోట్లు, లాభం రూ.158.77 కోట్లుగా ఉన్నది. బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సబ్బులు, సీరమ్స్, షాంపూలు, కండీషనర్లను అమ్ముతున్నది. ఇక ఈ డీల్‌తో ఉత్తరాది మార్కెట్లలో బంజారా బ్రాండ్‌ను విస్తృతపర్చాలని బజాజ్ భావిస్తున్నది.