న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: సంక్షోభంలో అల్లాడుతున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు. 2024 మార్చి 15 తర్వాత పేటీఎం పేమెం ట్స్ బ్యాంక్ తన వ్యాలెట్లలో ఖాతాదారుల నుంచి నగదు జమచేసుకోరాదంటూ ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేయడంతో పాటు డైరెక్టర్ల బోర్డును పునర్వ్యవస్థీకరించినట్టు పేటీఎం సోమవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
కొత్తగా నియమించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, మాజీ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజిని సిబాల్లతో డైరెక్టర్ల బోర్డును పునర్వ్యవస్థీకరించినట్టు పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ వివరించింది. వీరంతా ఇండిపెండెండ్ డైరెక్టర్లుగా ఇటీవల నియమితులయ్యారు. కొత్త చైర్మన్‌ను నియమించే ప్రక్రియను ప్రారంభించినట్టు కంపెనీ వెల్లడించింది.