న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: వొడాఫోన్ ఐడియా.. ఎంపిక చేసిన కొన్ని పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్, ఎంటర్ప్రైజ్ ప్లాన్లతో ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ సదుపాయాన్ని శుక్రవారం ప్రకటించింది. రూ.501 నుంచి ప్రారంభమయ్యే పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు, రూ.451 నుంచి మొదలయ్యే ప్రీపెయిడ్ అన్లిమిటెడ్ డాటా ప్లాన్లు, కార్పొరేట్ (సంస్థాగత వినియోగదారులు) ప్లాన్లకు ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్, ఇతర ప్రయోజనాలుంటాయని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది.
మా ఈ విప్లవాత్మక ఫ్రీ రోమింగ్ ఆఫర్‌తో కస్టమర్లు, వారి కుటుంబ సభ్యులు.. విదేశీ ప్రయాణాల్లోనూ చౌకగా టెలికాం సేవలను వినియోగించుకోవచ్చని చెప్పింది. 170కిపైగా దేశాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా వెల్లడించింది. విదేశాలకు వెళ్తే వేర్వేరు సిమ్ కార్డులు, స్థానిక లేదా ట్రావెల్ సిమ్‌లను కొనాల్సి వస్తున్నదని, దీనివల్ల మొబైల్ వినియోగదారులకు రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తుచేసిన వొడాఫోన్ ఐడియా.. ఈ ఆఫర్‌తో మా కస్టమర్లకు ఇక అలాంటి ఇబ్బందులేవి ఉండబోవన్నది. కాగా, ఏడాదికి మూడు ట్రిప్లదాకా ఈ ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని వొడాఫోన్ ఐడియా కస్టమర్లు పొందవచ్చు. దీనివల్ల ఏటా రూ.9,000 వరకు ఆదా అవుతుందని కంపెనీ సీఈవో అభిజిత్ కిశోర్ అంటున్నారు.