కొండాపూర్, మార్చి 7: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూపు ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో వెంకటేశ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో హీరో వెంకటేశ్‌తో కలిసి వాసవి గ్రూపు సీఎండీ ఎర్రం విజయ్‌కుమార్‌లు కొంపల్లిలో నూతనంగా ప్రారంభించిన వాసవి భువి, వాసవి ఆవాస ప్రాజెక్టులకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ మాట్లాడుతూ..రియల్ ఎస్టేట్ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వాసవి గ్రూపు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉన్నదని, అత్యాధునిక సాంకేతికతతో కమ్యూనిటీలను అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల వారికి నాణ్యతతో కూడిన సొంతింటిని అందించడంలో కృషి చేస్తున్న వాసవి గ్రూపు సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ..అన్ని వర్గాలకు డ్రీమ్ హోమ్స్ అందించడంలో వాసవి గ్రూపు ముందు వరుసలో ఉంటున్నదన్నారు. వాసవి గ్రూపు ఇప్పటికే 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, 17 కమర్షియల్ ప్రాజెక్టులు, 310 ఎకరాల స్థలంలో విల్లాలు, 4,510 అపార్ట్మెంట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కొంపల్లిలో 10.65 ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులో 8 టవర్లు, 17 అంతస్తులు, 2, 2.5, 3 బీహెచ్‌కేలను అందించనున్నట్లు తెలిపారు.