న్యూఢిల్లీ, జూలై 9: బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలో బ్రిటన్ కేంద్రంగా నడుస్తున్న సంస్థ వేదాంత రిసోర్సెస్.. ఓ పరాన్న జీవి అని, దాని భారతీయ అనుబంధ సంస్థ వేదాంత లిమిటెడ్‌ను అది కొద్దికొద్దిగా నాశనం చేస్తుందని అమెరికా షార్ట్ సెల్లర్ వైస్రాయ్ రిసెర్చ్ బుధవారం తీవ్ర ఆరోపణలు చేసింది. దేశీయ గనుల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న వేదాంత లిమిటెడ్‌కు మాతృ సంస్థగా ఉన్నటువంటి వేదాంత రిసోర్సెస్ రుణాలపై వైస్రాయ్ రిసెర్చ్ షార్ట్ పొజిషన్ తీసుకున్నది.
ఈ క్రమంలోనే వేదాంత రిసోర్సెస్.. మితిమీరిన అప్పులు, దొంగ సొమ్ముపై నిర్మించినదని, దాని లెక్కలన్నీ తప్పుల తడకలేనంటూ వైస్రాయ్ రిసెర్చ్ విరుచుకుపడింది. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటూ ఈ ఆరోపణల్ని వేదాంత గ్రూప్ ఖండించింది. కాగా, వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్‌కు సొంతంగా చేయదగిన చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ లేవని, భారత్‌లోని వేదాంత లిమిటెడ్పైనే ఆధారపడి నెట్టుకొస్తున్నదని వైస్రాయ్ రిసెర్చ్ అంటున్నది.
ఈ క్రమంలోనే గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వేదాంత నుంచి రూ.75,800 కోట్లను, హిందుస్థాన్ జింక్ నుంచి రూ.57,300 కోట్ల డివిడెండ్ రూపంలో వేదాంత రిసోర్సెస్ తీసుకున్నదని చెప్పింది. అలాగే తీసుకున్న అప్పులకుగాను ఏటా వేదాంత రిసోర్సెస్ చెల్లించే వడ్డీలు 200 మిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతూపోతున్నాయని, గతేడాది మొత్తం వడ్డీ చెల్లింపులు 835 మిలియన్ డాలర్లకు చేరాయన్నది.