అమీర్‌పేట్, ఆగస్టు 22: మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న సంస్థగా తన కస్టమర్ల పట్ల ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తామో.. సామాజిక బాధ్యతల పట్ల కూడా అంతే నిజాయితీగా వ్యవహరిస్తున్నామని వాసవి గ్రూపు సంస్థల డైరెక్టర్ అభిషేక్ చందా పేర్కొన్నారు.అవగాహన లేమితో కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ చానెళ్లు పని గట్టుకుని తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తుండటాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
1994లో ఎర్రమ్ విజయ్‌కుమార్ ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటి వరకు ఎక్కడా కస్టమర్లను ఇబ్బందులు పెట్టడంకానీ, బఫర్ జోన్ స్థలాలు, క్యాచ్మెంట్ భూములు, చెరువులను కబ్జాలు వంటి అక్రమ చర్యలకు ఎన్నడూ పాల్పడలేదని గురువారం వాసవి గ్రూపు సంస్థ న్యాయ సలహాదారు మాధవరావు, సంస్థకు చెందిన ఇతర ఉన్నతాధికారులు జాకీర్ హుస్సేన్, నర్సింహారావు, వరుణ్శర్మలతో కలిసి హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
అక్రమాలకు దూరంగా పూర్తి స్థాయి పారదర్శకతతో ముందుకు సాగుతున్న తమను కొందరు వ్యక్తులు అవగాహన లేమితో కబ్జాలకు పాల్పడుతున్నట్టు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేవలం వ్యాపారాత్మకంగానే కాక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వాసవి సంస్థ ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పటి వరకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ చెరువుల సుందరీకరణ, వరద నీటి కాలువలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పన, పేద చిన్నారులకు జ్ఞానేంద్రియాల లోటుపాట్లను సవరించడం, మూగజీవాల సంరక్షణ వంటి అనేక కార్యక్రమాలకు సొంత నిధులను పెద్దయెత్తున వెచ్చిస్తున్నట్టు తెలిపారు.
చెరువుల సుందరీకరణలో భాగంగా రహదారి విస్తరణ కోసం 2.5 ఎకరాల తమ సొంత స్థలాన్ని ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ చేసి ఇవ్వడం జరిగిందని, తాత్కాలిక రహదారులను కోట్లాది నిధులతో నిర్మించడం జరిగిందని, ఈ పనులన్నీ ఆయా ప్రభుత్వ విభాగాల అనుమతితో నిబంధనలకు లోబడి చట్టబద్దంగా చేపట్టినట్టు చెప్పారు.