న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కిసాన్ డ్రోన్లు వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కిసాన్ డ్రోన్ల వినియోగం క్రాప్ అసెస్మెంట్ను ప్రమోట్ చేయడానికి తోడ్పడుతుందన్నారు. అంతేగాక భూరికార్డులన్నింటినీ డిజిటైజేషన్ చేయడానికి కూడా డ్రోన్ వినియోగం ఉపయోగపడుతుందని చెప్పారు.
అంతేగాక, పంటలపై పురుగుల మందులను పిచికారి చేయడానికి, పంటలు ఏపుగా పెరుగడానికి అవసరమయ్యే పోషకాలను చల్లడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయం, ఫార్మ్ ప్రొడ్యూస్ వ్యాల్యూ చైన్‌కు సంబంధించిన రూరల్ ఎంటర్ప్రైజెస్ కోసం ఫైనాన్స్ స్టార్టప్స్ నెలకొల్పడానికి నాబార్డ్ ద్వారా నిధులను సమకూర్చనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ స్టార్టప్స్ ద్వారా రైతులకు సాంకేతికతలు సమకూరుతాయని ఆమె చెప్పారు.