Tariffs | హైదరాబాద్, ఏప్రిల్ 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 27 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. తాజా నిర్ణయంతో దేశంలోని వ్యవసాయ రంగానికి చెందిన చేపలు-రొయ్యలు, పాల ఉత్పత్తులు, కార్పెట్లు, చెప్పులు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, టెలికాం తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు పారిశ్రామిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ట్రంప్ తాజా టారిఫ్ వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై తీవ్రస్థాయిలో ప్రభావం ఉండనున్నట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం రొయ్యల్లో 40 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. 2024లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతైన చేపలు, రొయ్యలు, ఇతర ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతుల విలువ 2.58 బిలియన్ డాలర్లుగా ఉన్నది. తాజా సుంకాల వల్ల అక్కడి మార్కెట్లో మన ఉత్పత్తుల ధర పెరుగుతుంది. ఇదే అదునుగా ఈ రంగంలో భారత్‌కు పోటీగా ఉన్న ఈక్వేడార్, ఇండోనేషియా తమ ఉత్పత్తులను భారీగా దింపుతాయి. దీంతో ధర ఎక్కువగా ఉన్న మన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి బదులు.. అమెరికన్లు మిగతా దేశాల ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
యూఎస్‌కు ఎగుమతి అవుతున్న 181.49 మిలియన్ డాలర్ల విలువైన వెన్న, నెయ్యి, పాలపొడి వంటి పాల ఉత్పత్తుల ధరలు భగ్గుమనే అవకాశాలున్నాయి. 1.91 బిలియన్ డాలర్ల విలువ గల పండ్లు, పప్పు దినుసులు, కూరగాయలను మనం ఏటా అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. అలాగే, 199.75 మిలియన్ డాలర్ల విలువ గల వంట నూనెల కూడా ఎగుమతి అవుతున్నాయి. దీంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులు కూడా పెద్దయెత్తున జరుగుతున్నాయి. వీటి ధరలు కూడా పెరుగొచ్చని పారిశ్రామిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బంగార ఆభరణాల ధరలు అధికంకానున్నాయి. వీటిపై ట్రంప్ సుంకాలను పెంచడంతో అక్కడి మార్కెట్లో భగ్గుమనే అవకాశాలున్నాయి. 2024లో అమెరికాకు 11.88 బిలియన్ డాలర్ల విలువ గల బంగారం, వెండి, వజ్రాభరణాలు ఎగుమతయ్యాయి. తాజా పెంపుతో వీటిపై సుంకం 13.32 శాతానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. దీంతో అమెరికాలో భారత ఆభరణాల ధరలు పెరుగనుండటంతో కొనుగోలుదారులు మిగతా దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి.
భారత టెక్స్టైల్స్, కార్పెట్ పరిశ్రమపై తీవ్రస్థాయిలో ప్రభావం పడనున్నది. 2023-24లో 9.6 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు, కార్పెట్లు, ఇతర టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. మనం చేసే మొత్తం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో 28 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. తాజాగా సుంకాల పెంపుతో మన ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో వస్త్రరంగంలో మనకు పోటీగా ఉన్న బంగ్లాదేశ్, చైనాపై కూడా అమెరికా సుంకాలను భారీగానే విధించడం మనకు కొంతలో కొంత ఊరట కలిగించే అంశం.
భారత్ నుంచి 457.66 మిలియన్ డాలర్ల విలువైన ఫుట్‌వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై భారత్-అమెరికా మధ్య సుంకాల వ్యత్యాసం 15.56 శాతంగా ఉండటంతో.. అగ్రరాజ్యంలో మన చెప్పుల ధరలు భగ్గుమనగా, స్థానికంగా దొరికే చెప్పులు చవగ్గా ఉండనున్నాయి. దీంతో మన ఉత్పత్తులకు గిరాకీ ఉండకపోవచ్చు.
ఎలక్ట్రానిక్స్, టెలికాం, బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్లు తదితర రంగాలపై కూడా అమెరికా సుంకాలు విధించింది. భారత్ నుంచి అమెరికాకు 14 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఎగుమతి అవుతున్నాయి. తాజా పెంపుతో చవగ్గా దొరికే చైనా, కొరియా ఎలక్ట్రానిక్స్‌ను కొనుగోలు చేయడానికి అమెరికన్లు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు.
ఆటోమొబైల్ తదితర రంగాలకు సంబంధించి సుంకాల విషయంలో అమెరికా దూకుడు ప్రస్తుతానికి లేకపోవడంతో ఆయా రంగాలు పెద్దగా ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశంలేదని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు. అయితే, త్వరలో వీటిపై కూడా టారిఫ్ ప్రకటనలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.