Stock Markets | ముంబై, ఆగస్టు 26: వడ్డీరేట్లను తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ వ్యాఖ్యలు దేశీయ సూచీల్లో ఉత్సాహాన్ని నింపింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. మెటల్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో వరుసగా ఐదోరోజు సోమవారం సూచీలు భారీగా లాభపడ్డాయి. దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్‌లు మదుపరుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది.
ఒకదశలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 611.90 పాయింట్లు అందుకొని 81,698.11 పాయింట్లకు చేరుకోగా, మరో సూచీ నిఫ్టీ 25 వేల పాయింట్ల మైలురాయిని మళ్లీ అధిగమించింది. చివరకు 187.45 పాయింట్లు ఎగబాకి 25,010.60 వద్ద ముగిసింది. వరుసగా సూచీ ఎనిమిదో రోజు లాభపడటం విశేషం.